
- కేటీఆర్.. హద్దుల్లో ఉండకపోతే రాళ్లతో కొట్టిస్తం
- నాతో సవాల్ చేస్తే నీ బండారం బయటపెడ్తా అంటూ వార్నింగ్
కరీంనగర్, వెలుగు : ‘రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని, వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్’ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్, రేవంత్నిజమైన కేఆర్ బ్రదర్స్ అని మండిపడ్డారు. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, బావమరిది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో కచ్చితమైన ఆధారాలు ఉన్నా కేటీఆర్ను అరెస్ట్ చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌కు లోపాయికారి సపోర్ట్ చేస్తున్నది బీఆర్‌ఎస్సేనని మండిపడ్డారు.
శనివారం జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పచ్చీస్ ప్రభారీల సమావేశానికి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంజిరెడ్డితో కలిసి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై పోరాడుతున్న చరిత్ర బీజేపీదేనని అన్నారు. పనీపాట లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కేటీఆర్ను హెచ్చరించారు.
‘‘కేటీఆర్.. పైసలున్నాయన్న అహంకారంతో మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తం. తమాషా చేస్తున్నవా.. యూజ్ లెస్ ఫెలో.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు.. నీ బతుకంతా నా దగ్గర ఉంది.. పర్సనల్‌గా పోవద్దని ఆగుతున్నా..సవాల్ చేస్తే అన్నీ బయటపెడ్తా” అని ఫైర్ అయ్యారు. తాను సామాన్య కార్యకర్తను అని, కిందిస్థాయి నుంచి ఉద్యమాలు చేసి.. లాఠీదెబ్బలు తిని జైళ్లకు పోయి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.
నాకు ప్రజలే ముఖ్యం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన వెంటనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెడుతామని బండి సంజయ్ అన్నారు. తనకు కేంద్రమంత్రి పదవి కంటే ప్రజలే ముఖ్యమని, వారికోసం ఎంత వరకైనా తెగిస్తానని, రోడ్డెక్కి కొట్లాడేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌కు గ్రాడ్యుయేట్లు, టీచర్లు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లింలను బీసీల్లో చేర్చి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్... ఇప్పుడు బీసీ జపం చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు.
బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని, ప్రధాని మోదీ బీసీ వ్యక్తి అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల్లేక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నదని, కాంగ్రెస్‌కు క్యాండిడేట్లు దొరకక బయటి వాళ్లను అరువు తెచ్చుకున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్‌ఎస్ పేరుతో రూ.50 వేల కోట్లు వసూలు చేసేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు.. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్‌రావు, డి.శంకర్ పాల్గొన్నారు.