- హిందూ మత విశ్వాసాలను
- దెబ్బతీసే కుట్ర జరుగుతోంది
కరీంనగర్, వెలుగు: తీవ్రవాదులను తయారు చేస్తూ, బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక్ జమాతే సంస్థకు నిధులిస్తున్న ప్రభుత్వం.. 41 రోజుల కఠోర దీక్ష చేసే అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులెందుకు కేటాయించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘శబరిమలలో కొద్దిరోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు మీ కళ్లకు కన్పించడం లేదా?’ అని ఫైర్ అయ్యారు.
వీర్ బాల దివస్’ సందర్భంగా కరీంనగర్ లో సిక్కులు మంగళవారం చేపట్టిన ర్యాలీకి హాజరైన బండి సంజయ్ వారితో కలిసి గురుద్వార్ లో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేరళ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. ‘అక్కడ తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు.
గజగజ వణుకుతూ చలిలో గంటల తరబడి నిలబడి అరిగోస పడుతున్న దారుణ దృశ్యాలు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నయ్. చిన్న పిల్లోడిని కదిలించినా ఆ స్వాముల కష్టాలు చెబుతారు. మరి పాలకులకు కనబడకపోవడం సిగ్గు చేటు' అని అన్నారు. ఎక్కువ మంది దర్శించుకునే ధార్మిక ప్రదేశాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ, సౌకర్యాలు కల్పించకుండా భక్తులు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
తిరుమలలోనూ పులులు వస్తున్నాయనే భయంతో భక్తులు రాకుండా చేస్తూ హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందన్నారు. మసీదులో పనిచేసే ఇమామ్ లకు, చర్చిల్లో పనిచేసే పాస్టర్లకు జీతాలిస్తున్న ప్రభుత్వం ఆలయ పూజారులకు, గురుద్వారాలో పనిచేసే గురువులకు జీతాలెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.