ప్రజల గొంతు తడిపేందుకే అమృత్-2.0 : బండి సంజయ్ కుమార్

ప్రజల గొంతు తడిపేందుకే  అమృత్-2.0 : బండి సంజయ్ కుమార్
  • ప్రతి ఇంటికీ నీరు అందించాలన్నదే మా లక్ష్యం
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, వెలుగు: దేశంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం  అమృత్ -2.0 పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్ లోని ఉజ్వల పార్కు సమీపంలో ఫిల్టర్ బెడ్ వద్ద 1500 కేఎల్ క్లియర్ వాటర్ సంపు నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 

అనంతరం మేయర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ కరీంనగర్ బల్దియా పరిధిలో ప్రతిఒక్కరికీ 24 గంటలపాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఈ విషయంలో కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని ఎన్నికల వరకే రాజకీయాలని, కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్‌‌‌‌ను ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. 

అతిత్వరలో కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను టెంపుల్ సర్క్యూట్ పరిధిలోకి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ లోని టీటీడీ దేవస్థానానికి నిధుల మంజూరు అంశంపైనా టీటీడీ చైర్మన్‌‌తో మాట్లాడానని, కేంద్రమంత్రిగా ఈ విషయంలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ, అమృత్ నిధులు రావడం కరీంనగర్ ప్రజలకు మంచి నీళ్లు అందిస్తూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. 

అభివృద్ధికి కోసం పార్టీలకతీతంగా పని చేస్తాం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 

తాను, కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌన్సిలర్ స్థాయి నుంచే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగామని, తమకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, పార్టీలకతీతంగా అభివృద్ధికి  కృషి చేస్తామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల పూర్తికి సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు. 

మేయర్ మాట్లాడుతూ రాబోయే 30 ఏళ్ల వరకు నగర జనాభా 5 లక్షల వరకు పెరిగినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రూ.18 కోట్లతో చేపట్టే పనులతో డిసెంబర్ చివరికల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిధిలో 24 గంటలు తాగునీరందించేలా చర్యలు తీసుకుంటామని  తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

365బీ హైవే అలైన్‌‌మెంట్ మార్చాలని వినతి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నుంచి దుద్దెడ వరకు నిర్మించబోతున్న నేషనల్ హైవే అలైన్‌‌మెంట్‌‌ను మార్చాలని సిరిసిల్లకు చెందిన పలువురు భూబాధితులు, వివిధ పార్టీల లీడర్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌‌ను కోరారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు నిర్మాణంలో తాము విలువైన భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు హైవే నిర్మాణానికి తమ ఇండ్లు, పొలాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పార్టీల లీడర్లు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్​, బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.