కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో తాను పోటీ చేస్తున్నానని అనగానే కొంతమంది గుండెల్లో డప్పులు మోగుతున్నాయని, భయంతో దారుస్సలాం పోయి టోపీలు పెట్టుకుంటూ సాగిలపడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మనం ఇంకా మౌనంగా ఉంటే.. హైదరాబాద్‌లోని దారుస్సలాంను కరీంనగర్ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. మరోసారి రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ సత్తా చూపాలని యువతకు పిలుపునిచ్చారు. కరీంనగర్ వజ్రమ్మ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో దేవరకొండ అజయ్, శ్రీరాముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది యువకులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్బరితెగించి వ్యవహరిస్తోందని, ఇతర పార్టీల కార్యకర్తలు, యువతకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆఫర్ చేస్తోందని ఆరోపించారు. యువతను డ్రగ్స్‌కు అలవాటు చేస్తోందన్నారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని, కానీ ఎన్టీఆర్ టైంలో మంత్రి పదవి కోసం కేసీఆర్.. కేటీఆర్‌గా మార్చిండని ఆరోపించారు. కేసీఆర్‌వన్నీ మోసాలేనని, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్, పార్లమెంట్ కన్వీనర్ బి.ప్రవీణ్ రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇజ్రాయెల్‌లోని కరీంనగర్ వాసులతో మాట్లాడిన బండి సంజయ్
ఇజ్రాయెల్‌లో యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న కరీంనగర్ వాసులు ధైర్యంగా ఉండాలని, మీకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ బండి సంజయ్ ధైర్యం చెప్పారు. బుధవారం ఇజ్రాయెల్‌లోని కరీంనగర్ఎంపీ వీడియో కాల్‌లో మాట్లాడారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇబ్బందులేమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తెలుగు వాళ్లంతా ఐక్యంగా ఉండాలి. నిత్యం ఒకరికొకరు మాట్లాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇజ్రాయెల్‌లో భద్రంగా ఉన్నామని, అక్కడి ప్రభుత్వం తమను బాగా చూసుకుంటోందని చెప్పారు.