హిందూ ధర్మం, దేశ రక్షణలో ముందుకు రావాలి : బండి సంజయ్​కుమార్​

వేములవాడరూరల్, వెలుగు : మాల్దీవ్స్​ విషయంలో భారతీయులు తీసుకున్న చొరవ.. హిందూ ధర్మ, దేశ రక్షణ, దేశ ఐక్యతలో ఇదే పంథాను కొనసాగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వేములవాడ రూరల్​ మండలం వెంకటాంపల్లి గ్రామంలో సోమవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, పథకాలను, సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతులు సంఘంగా ఏర్పడితే సబ్సిడీ రుణాలు పొందవచ్చన్నారు.  అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్​హామీ ఇచ్చిందని, గత ప్రభుత్వం ప్రజలపై అప్పుభారం మోపారని, కొత్త హామీలను ఎలా తీరుస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.  ప్రభుత్వ బడుల్లో స్కావెంజర్లు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైస్కూల్​కు చెందిన స్టూడెంట్​అనూష మనమంతా ఒకటే... కొలిచే దేవతలెందరున్నా తల్లి భారతి ఒక్కటే నంటూ స్టేజీపై పాట పాడగా ఎంపీ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, లీడర్లు డా.చెన్నమనేని వికాస్​రావు, తిరుపతి, మల్లిఖార్జున్​, సర్పంచ్​ చంద్రయ్య పాల్గొన్నారు.