కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో తన ఫోకస్ మొత్తం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపైనే ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కరీంనగర్ లో బీజేపీ దమ్ము చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గాల్లో యుద్ధభేరి మోగిద్దామని బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంతోపాటు నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకల నిర్వహణ, త్వరలో చేపట్టబోయే బస్ యాత్ర వంటి అంశాలపై చర్చించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇన్నాళ్లు బిజీగా ఉండటం వల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేదన్నారు బండి సంజయ్. కానీ ఇప్పుడు తనకు ఎలాంటి పని లేదని..ఇక తాను ఎక్కువ సమయాన్ని కరీంనగర్ జిల్లాలపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే కరీంనగర్ తో పాుట..ఎక్కడైనా పోటీ చేస్తానన్నారు. జమిలి ఎన్నికలొస్తాయా? అసెంబ్లీ ఎన్నికలొస్తాయా? అనే దానితో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండాలని నేతలకు సూచించారు. తనకిప్పుడు అధ్యక్ష పదవి లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎంఐఎం నాయకులను తీసుకెళ్లి అసదుద్దీన్ ఒవైసీని కలిశారని.... ఇట్లాంటోళ్లనా గెలిపించేది? కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు.
Also Read :- తెలంగాణలో ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేదు.. లిక్కర్ దందా సొమ్ము ఏం చేస్తున్నవ్
డబ్బుకు అమ్ముడుపోతే ప్రజల మనసు గెలవలేరని బండి సంజయ్ తెలిపారు. కాంప్రమైజ్ రాజకీయాలకు, కుమ్మక్కు రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. తనకు వేరే ఆశలేదు. తనకు లాబీయింగ్ చేతకాదని వెల్లడించారు. తానెవరనీ మోసం చేయను... ఎవరినైనా మోసం చేస్తే.. మన కుటుంబాలకు కూడా ఆ పాపం తగులుతుందని చెప్పారు.