గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, అభివృద్దికి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, గల్ఫ్ కార్మికులను ఉద్దేశించి చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం సంగతి దేవుడెరుగు... గల్ప్ లో చనిపోతే వారి శవాలను కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు.
నేటికీ ఎంతో మంది గల్ఫ్ లో ఉద్యోగాలు దొరకక, ఏజెన్సీల మాటలు నమ్మి మోసపోయి జైళ్లలో మగ్గుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉంటే గల్ఫ్ కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. విదేశాలతో మాట్లాడి అక్కడున్న సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే గల్ప్ కార్మికుల సంక్షేమ డిమాండ్లన్ని నెరవేర్చడంతో పాటు గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.