నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో బూత్ ఇన్చార్జిలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం మర్రిగూడలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు ఆఫీసులో బూత్ ఇన్చార్జిలతో ఆయన భేటీ అయ్యారు. ఎన్నికల స్టీరింగ్‌కమిటీ కన్వీనర్వివేక్ వెంకటస్వామి, కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. నాలుగైదు రోజుల నుంచి బూత్ ఇన్చార్జిలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా..ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రజల నుంచి ఏరకమైన స్పందన వస్తోంది? అనే అంశాల పై సంజయ్ చర్చించారు.
ఫీల్డ్ లెవెల్లో రాజగోపాల్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ పార్టీ సింబల్ విషయంలో కొంత గందరగోళం నెల కొందని పలువురు ఇన్చార్జిలు తెలిపారు. అరవై ఏండ్లు దాటిన ఓటర్లలో రాజగోపాల్ రెడ్డి పేరు చెబుతున్నప్పటికీ పార్టీ సింబల్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఇన్చార్జిలు వివరించారు. టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని తమ వైపు తిప్పుకునేందుకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఇన్చార్జిలు సంజయ్‌కు వివరించినట్లు తెలిసింది. వీటిపైన స్పందించిన సంజయ్ మాట్లాడుతూ..ఎన్నికలకు ఇంకెంతో టైం లేదని, 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రచారం వేగవంతం చేయాలని, బీజేపీ కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఏ ఒక్కరు కూడా ఎన్నికలయ్యే వరకు ఊరు దాటి పోవద్దని, అభ్యర్థి గెలుపే ప్రధానంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బండి సంజయ్ అన్నట్టు తెలిసింది.