సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొనడంతో నాలుగు నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.270 కోట్లను ఇంతవరకూ చెల్లించకపోగా, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 20 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు పనుల్లేక పస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు పరిశ్రమనే బంద్ పెట్టారని, దీని వల్ల అనుబంధ రంగాలపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని, వాటిని నెరవేర్చడంతో పాటు బకాయిలు విడుదల చేయాలని లెటర్‌లో కోరారు. అలాగే పవర్‌లూమ్ కార్ఖానాలకు 50 శాతం విద్యుత్ సబ్సిడీని నిలిపివేయడంతో రెట్టింపు బిల్లులు వస్తున్నాయన్నారు. విద్యుత్ బకాయిలను మాఫీ చేయడంతో పాటు సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీని సైతం ఇవ్వాలని కోరారు. ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.