సీఎం హామీలు ఇచ్చుడు తప్ప అమలు చేసుడు లేదు

యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ సాధన కోసం సీఎం, ఆయన కొడుకు కేటీఆర్, ఎంపీ సంతోష్ ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగిరి పట్టణంలోని వినాయక్ చౌరస్తాకు చేరుకున్న బండి సంజయ్.. సీఎం వైఖరిని తూర్పారబట్టారు. నదులకు నడక నేర్పానని చెప్పే కేసీఆర్.. నీటిలో మునిగిన మోటర్లకు ఎందుకు ఈత నేర్పలేదని ప్రశ్నిచారు. సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేయడని బండి సంజయ్ విమర్శించారు. గల్లీగల్లీలో వైన్ షాపులు వెలిశాయే తప్ప డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తాననగానే చేనేతలకు బీమా ఇస్తానంటున్నాడని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కారు కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. 

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అక్రమాలకు అడ్డాగా మారిందని, అసలు ఎవరి కోసం తెలంగాణ వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయన్న పరిస్థితి నెలకొందని, మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని అడుగుతున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం యువకులు, ఉద్యోగులు బయటకు వచ్చి బీజేపీకి మద్దతివ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్, ఎంఐఎంలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని విమర్శించారు. 

మొదటి విడత పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని ఉచిత విద్య, వైద్యం అందిస్తామనిహామీ ఇచ్చినట్లు బండి సంజయ్ చెప్పారు. రెండో విడత యాత్రలో పేదల కోసం ఇళ్లు నిర్మించడం, ఫసల్ బీమా ఇస్తామని హామీ ఇచ్చామని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.