పేదల భూములు గుంజుకునేందుకే ధరణి

పేదల భూములు లాక్కునేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రైతు సమస్యలపై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ఇష్టరీతిన పేదల భూములు గుంజుకుంటున్నరని మండిపడ్డారు. రైతుల గోడు విన్న సంజయ్ వారి కష్టాలకు కారణమైన కేసీఆర్ సర్కారు తీరును ఎండగట్టారు.  ముఖ్యమంత్రి కుటుంబం గుంటనక్కల్లా పైసలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదల భూములు పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. 

ఓట్ల కోసం రాలేదు

ఓట్ల కోసం తాము రాలేదని, యాత్ర మొదలయ్యాకే ఇక్కడ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ అన్నారు. చౌటుప్పల్ లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు పెట్టి, స్థానికులకు కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కేసీఆర్ ఒక్కో ఓటుకు రూ.30,000 ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని, ఓటర్లు ఆ డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఎవరికి వేయాలో వారికే వేయాలని చెప్పారు. పవర్ (కరెంట్) ఇవ్వని కేసీఆర్ పవర్ ను కట్ చేద్దామని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్.. తన కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఫైర్ అయ్యారు. 

జనాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్
రైతులు పండించే ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అని చెప్పి ఫాం హౌస్ లో పండుకున్నడని బండి సంజయ్ ఆరోపించారు. రైతులను వద్దని తన ఫాం హౌస్లో మాత్రం వరి వేసుకున్నారని విమర్శించారు. మోడీ ఇచ్చే పైసలను కూడా తానే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. రైతు సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు రూ.6వేల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, కేసీఆర్ కేవలం రైతు బంధు ఇచ్చి అన్నదాతలకు దక్కాల్సిన అన్ని సబ్సిడీలను వారికి అందకుండా చేస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం 2,40,000 ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇండ్లు కట్టించారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఉవ్వని ముఖ్యమంత్రి ఊరికి ఒక బెల్టు షాపు మాత్రం ఇచ్చాడని సటైర్ వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రజలందరినీ మోసం చేస్తున్నారని, అందుకే బీజేపీని ఆదరించి జనానికి సేవ చేసే అవకాశం కల్పించాలని బండి సంజయ్ కోరారు.