కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి .... బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం

కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి .... బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం


కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే NDA ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ల్ లీడర్లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా పనిచేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలోని గల్లీగల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. మరోవైపు BRS ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేశారు. దీంతో బండి సంజయ్ కి నేషనల్ లేవల్ లో క్రేజ్ వచ్చింది.

బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్ లో జన్మించారు. బి.నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు. బండి సంజయ్ తండి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్  లోని సరస్వతి శిశుమందిర్ లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరారు. ఆయన ఘటన్  నాయక్ గా,ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ ఎస్ ఎస్ లో పని చేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్ లోనే సాగింది.  ఆ తరువాత 2014లో తమిళనాడులోని మధురై కామరాజ్ యూనివర్శిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 

బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. 12 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇంచార్జీగా కూడ ఆయన పనిచేశారు. మరో వైపు భారతీయ జనతా యువమోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994-2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్ కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు.

2005లో  కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పోరేటర్ గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి  2019 వరకు ఈ కార్పోరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిథ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో  కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్  బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను 2020 మార్చి 11న  ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ, సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం.  ఆ తరువాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.