మేమంతా ఒక్కటే మా మధ్య విభేదాల్లేవ్ : బండి సంజయ్

మేమంతా ఒక్కటే మా మధ్య విభేదాల్లేవ్ : బండి సంజయ్
  • రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తామంతా ఒకటే అని, ఎలాంటి విభేదాల్లేవని తెలిపారు. బీజేపీలో అందరం కలిసే ఉన్నామన్నారు. హిందుత్వం కోసం నిరంతరం పోరాడే నాయకుడు రాజాసింగ్ అని కొనియాడారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గోషామహల్​లోని ఆకాశ్​పురి హనుమాన్ ఆలయానికి వచ్చిన బండి సంజయ్​కు రాజాసింగ్ ఘన స్వాగతం పలికారు. 

అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘2018 నుంచి బీజేపీ తరఫున వరుసగా గెలుస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్​లారా... మీరు మళ్లీ గెలవాలనుకుంటున్నారు కదా? మీకు ఓట్లేసి గెలిపించేది హిందువులే తప్ప అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎంఐఎం అభ్యర్థికి ఓటేస్తే... హిందూ సమాజమంతా ఒక్కటై మిమ్ముల్ని ఓడించడం ఖాయం’’అని అన్నారు.

ఆధారాలుంటే బయటపెట్టాలి

బీజేపీ ఎంపీ అనే ఓ బ్రోకర్ ద్వారా హెచ్​సీయూ భూములు అమ్మేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్న కేటీఆర్ కామెంట్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేటీఆర్ కు నిజంగా దమ్ముంటే, ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎవరో బయటపెట్టొచ్చు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే’’అని సంజయ్ అన్నారు. ‘‘రేవంత్ రెడ్డి సర్కార్ పై పోరాడుతున్నది బీజేపీనే. హెచ్​సీయూ భూములపై పోరాడి జైలుకు పోయాం. 

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆరు గ్యారంటీలపై కొట్లాడిందా? వాకౌట్ చేసిందా? పోరాడి జైలుకు పోయింది ఏబీవీపీ కార్యకర్తలే. మీరు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప పోరాడారా?”అని కేటీఆర్​ను ప్రశ్నించారు. హెచ్​సీయూ భూములను ఎట్టిపరిస్థితుల్లో అమ్మనీయబోమని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని తెలిపారు.