ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసమే ప్రజా సంగ్రామ యాత్ర

తొమ్మిదేండ్లుగా తోడేళ్ల లెక్క తెలంగాణను పీక్కు తింటున్న అవినీతి, నియంతృత్వ పాలకులను తరిమికొట్టడానికి బీజేపీ నిత్యం పోరాటం చేస్తున్నది. ఈ పోరాటానికి ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర మరో నూతన అధ్యాయం కాబోతున్నది. కేసీఆర్‌‌ కుటుంబ పాలనను, లారీల కొద్దీ ప్రజల డబ్బును, టన్నుల కొద్దీ ప్రజల సొమ్మును దోచుకున్న టీఆర్‌‌ఎస్‌‌ నాయకులను గద్దె దించే వరకూ కాషాయ సైనికుల కవాతు ఆగదని శంఖం పూరించబోతున్నది. రాష్ట్రంలో మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం ‘బీసీ బంధు’, అణగారిన ఎస్టీ బిడ్డల కోసం ‘గిరిజన బంధు’ను తీసుకురావడమే లక్ష్యంగా, సకల జనులు కలలు కన్న  భావి తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ కుమార్‌‌ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో విడత నవంబర్‌‌ 28న ప్రారంభం అవుతున్నది. 

ప్రజల విశ్వాసం పెరిగింది

ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో ఎండగడుతూ, భావి సామాజిక తెలంగాణ కోసం ప్రణాళికలు రచిస్తూ బండి సంజయ్‌‌ ఇప్పటికే నాలుగు విడతల్లో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. నిరుడు ఆగస్టు 28న చార్మినార్‌‌ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అయినా వెనకడుగు వెయ్యకుండా, వెన్ను చూపకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు విడతలుగా 21 జిల్లాల్లో 1,178 కిలోమీటర్లు నడిచి బండి సంజయ్‌‌ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహం, ఉద్వేగంతో ఆయన మరో విడత పాదయాత్రకు బయలుదేరారు.

నవంబర్‌‌28న నిర్మల్‌‌లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అశేష జనవాహిని మధ్య కాషాయ కార్యకర్తలతో కలిసి ఆయన ముథోల్‌‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌ పార్లమెంట్‌‌ నియోజకవర్గాల్లో 225 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాదయాత్ర డిసెంబర్‌‌17న, కరీంనగర్‌‌ లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుంది. ‘టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థిని గెలిపించండి, మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటా, ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేలా చర్లగూడెంతో పాటు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవెన్యూ డివిజన్‌‌ తో పాటు మీ కోరికలన్నీ15 రోజుల్లోనే  తీరుస్తా’ అని అన్నారు. 15 రోజులు దాటిపోతున్నా వాటి మీద ఒక్క ప్రకటనా రాలేదు.

మునుగోడును దత్తత తీసుకుంటనని చెప్పిన ఆయన కుమారుడి మాటలు కూడా ఉత్తరకుమారుడి ప్రగల్భాలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా, ఓట్ల కోసం కొత్త వేషంలో వచ్చి కేసీఆర్‌‌ చెప్పిన అబద్ధాలను నమ్మి మునుగోడు ప్రజలు మోస పోయారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడా రాకూడదనే పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తం. అప్రజాస్వామికంగా వంద మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా మిడతల దండులా మునుగోడుపై పడితే, పట్టుమని పదివేల మెజారిటీతో గట్టెక్కారు. గత ఎన్నికతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు ఇక్కడ12 వేల నుంచి 86 వేలకు పైచిలుకు పెరిగింది. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇదే నిదర్శనం.

సకల జనుల కోసం

రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా కుట్రపూరితంగా కేసీఆర్‌‌ అణచివేస్తున్నరు. బీసీలకు పదవులు లేవు, పనులూ లేవు. బీసీల బాగు కోరే బీజేపీ ‘బీసీ బంధు’ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌‌ చేస్తున్నది. ఈ యాత్ర ద్వారా ‘బీసీ బంధు’ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తం.  ‘పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్త. మంత్రివర్గాన్ని, అధికార గణాన్ని వెంట తీసుకెళ్లి, నేనే అక్కడ కుర్చీ వేసుకొని ప్రజా దర్బార్లు పెట్టి పట్టాలు ఇస్తా’ అని కేసీఆర్‌‌ చాలాసార్లు చెప్పారు. కానీ, ఇప్పటికీ ఆయనకు కుర్చీ దొరకకపోవడం హాస్యాస్పదం. పోడు భూముల్లో మొక్కలు నాటాలని ఒక వైపు అధికారులకు ఆదేశాలు ఇచ్చేది వారే.  

ఇంకోవైపు పోడు భూములకు పట్టాలిస్తామని అడవిబిడ్డలకు హామీ ఇచ్చిందీ వారే. దీంతో అధికారులు, పోడు రైతుల మధ్య నిత్యం గొడవలే. ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.  ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌‌ఆర్వో హత్య దాని ఫలితమే! గత ఎనిమిదేండ్లలో ఇలాంటివి 843 ఘటనలు జరిగాయి. దీనికి కేసీఆర్‌‌ తీరే కారణం. ‘గిరిజన బంధు’ అమలు చేసేవరకు బీజేపీ పోరాటం ఆగదు.  తెలంగాణ ద్రోహులే అధికారం పంచుకుంటున్నరు. ఊళ్లను బెల్ట్‌‌ షాపులకు, పట్నాలను పబ్బులకు అప్పగించి, తెలంగాణ అస్థిత్వాన్ని, సంస్కృతిని టీఆర్‌‌ఎస్‌‌ దెబ్బ కొట్టింది. ప్రజా జీవితాన్ని, ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేసిన టీఆర్‌‌ఎస్‌‌ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పేందుకు, సకల జనులు కలలు కన్న తెలంగాణను పునర్నిర్మించడానికి బీజేపీ ఈ ప్రజాసంగ్రామ యాత్ర అనే యజ్ఞం చేస్తున్నది. 

ప్రజారంజక పాలనే లక్ష్యంగా..

ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తెలంగాణకు అందిస్తున్న నిధుల గురించి ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తం.  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను దారి మళ్లిస్తూ , పథకాల పేరు మార్చి క్రెడిట్‌‌ తమ ఖాతాలో వేసుకుంటూ.. చివరికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ గులాబీ మూక చేస్తున్న దుష్ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తం. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ప్రభుత్వ పక్షపాత, నియంతృత్వ వైఖరిని ఎండగడ్తం. అధికార అహంకారం తలకెక్కిన సీఎంను ఫామ్​హౌజ్‌‌ నుంచి బయటకు తీసుకొస్తం.

కుటుంబస్వామ్యానికి చరమగీతం పాడి, డబుల్‌‌ ఇంజన్‌‌ సర్కారుతో ఉద్యమ ఆకాంక్షల తెలంగాణను తీర్చిదిద్దడానికి అవసరమైన సలహాలు, సూచనలు ప్రజల నుంచి స్వీకరిస్తం. గత నాలుగు విడతల ప్రజాసంగ్రామ పాదయాత్ర వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. టీఆర్‌‌ఎస్‌‌ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డయ్‌‌. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీగా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిల్లుకు సహకరించి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీజేపీకి తెలంగాణ ఆకాంక్షలపై స్పష్టమైన అవగాహన అంది.  భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు ఉన్నయ్‌‌. బాసర సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం, ప్రజల ఆధారాభిమానాలతో అందరూ కమలదండుతో చేతులు కలపాలని, కుటుంబ పాలనను అంతమొందించి ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం.

భరోసా ఇస్తూ..

ఇటీవల టీఆర్‌‌ఎస్‌‌ నాయకుల ఇండల్లో ఐటీ దాడులు చేస్తుంటే, లారీల కొద్దీ డబ్బు, టన్నుల కొద్దీ బంగారం, వెండి బయటపడుతున్నది. ఈ దోపిడీ డబ్బుతోనే మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు వేలకు వేలిచ్చి, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చారు. వారి అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడ్తరు, దాడులు చేస్తరు. వారి అవినీతిని పట్టుకుంటే... తాము పవిత్రులమని నిరూపించుకోవాల్సిందిపోయి,  బీజేపీ కక్ష సాధింపు అనడం సిగ్గుచేటు. ఇగ, ఢిల్లీ లిక్కర్‌‌ కేసులో దొరికిపోయిన నాయకులు తెలంగాణ రాష్ట్ర పరువు తీశారు.

అవినీతి కేసుల్లో ఇరుక్కున్నదిగాక, దాన్నుంచి తప్పించుకోవడానికి బీజేపీ మీద బురద చల్లడానికి కుట్రలు చేస్తున్నరు. ఈ వాస్తవాలతో వారిని ప్రజాకోర్టులో నిలదీసి, వెలేసే రోజులు దగ్గరవడ్డయ్‌‌. సకల జనుల పోరాటాలు, విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కలల్ని కల్లలు చేసింది. ఈ తొమ్మిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. పొలాలకు నీళ్లు రాలే. డబ్బా ఇండ్లు డబులు బెడ్రూం ఇండ్లు కాలే. ఊరికి నిధులు రాలే.  రైతుల అప్పులు తీరలే. ఆస్పత్రికి పోతే ఖర్చుల కష్టాలు తగ్గలే. బడి ఫీజుల బాధలు తప్పలే. ఉద్యమకారులకు అవకాశాలు రాలే. ఇట్లా, ఏ దిక్కు నుంచి చూసినా... తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. కొత్త రాష్ట్రంలో కేసీఆర్‌‌ కుటుంబానికి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు తప్ప ఏ ఒక్కరికీ మేలు జరగలే. కేసీఆర్‌‌ నియంతృత్వ, కుటుంబ పాలనలో జనం అరిగోసలు పడుతున్నరు. వారి గోస తీర్చడానికి, భరోసా ఇచ్చి వారి తరఫున కొట్లాడటానికే  బీజేపీ ఈ ప్రజా సంగ్రామయాత్ర సాగిస్తున్నది. - డా. గంగిడి మనోహర్‌‌రెడ్డి, ప్రముఖ్‌‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర