తెలంగాణలో ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేదు.. లిక్కర్ దందా సొమ్ము ఏం చేస్తున్నవ్

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు కనీస వేతనాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సమగ్ర శిక్షా ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని నిలదీశారు. తెలంగాణ వస్తే  కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరనే హామీ ఏమైందని సీఎం కేసీఆర్ ను  అడిగారు. గుజరాత్ లో 45 వేలకుపైగా జీతాలిస్తున్నారని.. హర్యానా, తమిళనాడు, సిక్కిం రాష్ట్రాల్లో 50 వేలకుపైగా వేతనాలిస్తున్నరని చెప్పారు. కానీ  తెలంగాణలో మాత్రం 15 వేలకు మించి ఎందుకు జీతాలివ్వడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే కేసీఆర్ కు .. అక్కడ ఎంతిస్తున్నరో తెల్వదా అని నిలదీశారు బండి సంజయ్. 

రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది సమగ్ర శిక్షా  ఉద్యోగులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమన్నారు బండి సంజయ్. ఏళ్ల తరబడి గొడ్డు చాకిరి చేస్తున్నా కనీస వేతనాలను అమలు చేయకపోవడం బాధాకరమని చెప్పారు.  వాజ్ పేయి ప్రారంభించిన పథకం సమగ్ర శిక్షా అభియాన్ అని.. దీనికి కేంద్రమే అధిక నిధులిస్తోందని చెప్పారు.  2014 నుండి కేంద్ర నిధులే తప్ప రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.  బీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  నిత్యం కేంద్రాన్ని బద్నాం చేస్తున్నరని... రాష్ట్రం చేయాల్సిన పని మాత్రం చేయదన్నారు.  బీజేపీ అధికారంలోకి రాగానే మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేసి సర్వశిక్ష ఉద్యోగులను ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.  

Also Read :- సింగిల్ గా పోటీ చేస్తాం...కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే

తెలంగాణలో ఉద్యోగ, ఆరోగ్య భద్రత ఎందుకు కల్పించడం లేదని సీఎం కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు.  మహిళలకు ప్రసూతి సెలవులు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. లిక్కర్ దందాపై ఏటా రూ.50 వేల కోట్లు  ఆదాయం సంపాదిస్తున్నారని... ఆ సొమ్ము ఏం చేస్తున్నవ్ అని అడిగారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్న కేసీఆర్.. సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలిచ్చుకుని కోట్లు సంపాదిస్తున్న కేసీఆర్..సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఏం చేశారని ప్రశ్నించారు.  ఎన్నికలొస్తున్నాయని తెలిసి రెగ్యులరైజ్ చేస్తామని మోసపూరిత హామీలిచ్చి.. మరోసారి కేసీఆర్ ఉద్యోగులను మోసం చేసినా ఆశ్చర్యం లేదన్నారు. కేసీఆర్ కు కు ఏమాత్రం  చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వెంటనే సర్వశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి.. హెల్త్ కార్డులివ్వాలి. ఉద్యోగ భద్రత ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు.