- సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ నేను, రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే..
- కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఖూనీ చేస్తున్నయ్
- సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ పేరున్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగిందన్నారు. ఇందులో కేటీఆర్‌కు కూడా సంబంధం ఉందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను, రేవంత్ ఇద్దరం బాధితులమే. మాతో పాటు హరీశ్ రావు కూడా బాధితుడే. కేసీఆర్ మెడలు వంచింది.. ఫామ్‌హౌజ్ నుంచి బయటికి గుంజింది నేనే కాబట్టి.. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’అని అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆ పార్టీ నేతలు పెద్దిరెడ్డి, వెంకటేశ్వర్ రావు, ప్రకాశ్ రెడ్డి, ఎన్వీ సుభాశ్, రాణి రుద్రమ, సంగప్పతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఖూనీ చేస్తున్నయ్. ఈ రెండు పార్టీలు నన్ను కరీంనగర్లో ఓడిచేందుకు కుట్రలు పన్నుతున్నయ్. గతంలో నయీం కేసు, డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లాంటి కేసుల మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసునూ మూసివేసే కుట్ర జరుగుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోని వియ్యంకుడు అశోక్ రావు కూతురు ఇంట్లోనే ఉంటున్నడు. కేసీఆర్, కేటీఆర్ సహా బాధ్యులంతా దోషులుగా మారుతారని తెలిసి కూడా ప్రభాకర్‌రావును ఇండి యాకు తీసుకురావడం లేదు’’అని విమర్శించారు.
ఓ మంత్రితో చీకటి ఒప్పందం!
ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు రాకుండా కేసీఆర్ కుటుంబం కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ ఇచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా సదరు మంత్రి పని చేస్తున్నారని అన్నారు. ‘‘అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని నిందితుడు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయినా, ఇప్పటి వరకు కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేదు. నా ఇంటి వద్ద ఉన్న పెట్రోల్ బంక్, టెంపుల్ దగ్గర్లో వెహికల్స్ పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు.
రాధాకిషన్ రావు ప్రతిమ హోటల్లోని 314 రూమ్‌లో ఉంటూ నా ఫోన్ ట్యాప్ చేసిండు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వియ్యంకుడైన అశోక్ రావు ద్వారానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్థిక లావాదేవీలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు టికెట్ రావడానికి ప్రధాన కారకుడు కూడా ప్రభాకర్ రావే’’అని ఆరోపించారు. రాజేందర్‌కు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఆ పార్టీ కార్యకర్త కూడా కాదని, ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు రాజేందర్ రావు కోట్ల రూపాయలు ఇప్పించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కోట్ల రూపాయలు ముట్టజెప్పించారని ఆరోపించారు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కల్యాణి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు.
ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశం
ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై సమగ్ర విచారణ చేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. అవసరమైతే ఎన్ఐఏకు ఇవ్వాలన్నారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు అయినట్టు భావించాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘కేసీఆర్ సిగ్గులేకుండా భార్యాభర్తలు మాట్లాడేది కూడా ట్యాప్ చేయించాడంటే.. ఎంతటి నీచుడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానం వస్తున్నది. అందుకే ఫేస్‌టైమ్, సిగ్నల్ యాప్ లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కేసు సీబీఐకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. ఆధారాలు ఆ శాఖ అధికారులకు ఇస్తాం’’అని తెలిపారు.