నాడు పర్మిషన్ ​ఇచ్చి ఇప్పుడు వద్దంటరా?: కేటీఆర్​కు సంజయ్ సవాల్

నాడు పర్మిషన్ ​ఇచ్చి ఇప్పుడు వద్దంటరా?: కేటీఆర్​కు సంజయ్ సవాల్
  • రాడార్ ​స్టేషన్​కు ఎందుకు అనుమతిచ్చారని మీ నాన్నను నిలదీయ్ 
  • కేటీఆర్​కు సంజయ్ సవాల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాడార్ స్టేషన్​ ఏర్పాటుకు పర్మిషన్​ ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకించడం వాళ్ల ద్వంద వైఖరికి నిదర్శనమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాడార్ స్టేషన్​ ఏర్పాటుకు ఎందుకు అనుమతిచ్చారంటూ కేసీఆర్​ను నిలదీయాలని కేటీఆర్​కు సూచించారు. 

కేటీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్​ ఫాంహౌస్​​ఎదుట ఆందోళన చేయాలని సవాల్​ చేశారు.  కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన వ్యవస్థను ఆయన కొడుకు ఆధ్వర్యంలో పార్టీ నేతలు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ఆనాడు సోయిలో ఉండే రాడార్​ స్టేషన్​ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారా? లేదా? అనేది తెలుసుకుంటే బాగుండేదని కేటీఆర్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతిస్తూ భూముల బదలాయింపునకు ఎందుకు అంగీకారం తెలిపారని కేసీఆర్​ను నిలదీస్తే బాగుండేదన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్​ను బీఆర్ఎస్ నేతలు వ్యతిరే కించడమంటే దేశ భద్రతను వ్యతిరేకిస్తున్నట్టేనని,  దేశరక్షణ వ్యవస్థలను అవమానించిట్టేనని అన్నారు.