హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలతో పంట నష్టపోయినవారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తరుగు లేకుండా వడ్లను ఎందుకు కొనట్లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడవకుండా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక రెండో పంట కూడా వచ్చినా.. వడ్లకు రూ. 500 బోనస్ హామీని అమలు చేయలేదన్నారు. సన్న వడ్లకే బోనస్ అంటూ వార్తలు వస్తున్నాయని.. అన్ని రకాల వడ్లకూ బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.