కరీంనగర్: పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, తదనంతర పరిణామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ గొడవ అల్లు అర్జున్కు, రేవంత్ రెడ్డికున్న వ్యక్తిగత కక్షలాగా తనకు కనిపిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలపై చర్చ చేయాల్సిన అసెంబ్లీలో ఓ వ్యక్తి గురించి గంట సేపు మాట్లాడటం ఏంటని సీఎం రేవంత్పై ఆయన మండిపడ్డారు. అప్పటికే అరెస్టై విడుదలైన అల్లు అర్జున్ గురించి చర్చించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
చట్టం తన పని తాను చేస్తుంటే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏముందని రేవంత్ రెడ్డిని నిలదీశారు. 17 వందల కోట్ల కలెక్షన్ పుష్ప-2కు వచ్చిందంటున్నారని, పుష్ప-3 ఇంకా రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి ఆ సినిమా చూపెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇద్దరి మధ్య కూడా ఏదో జరిగే ఉంటుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన మహిళ భర్తే ఫిర్యాదు వాపస్ తీసుకున్నాడని, ప్రభుత్వంపై నమ్మకం లేకనే కేసు వాపస్ తీసుకున్నాడని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
ALSO READ | రేవంత్ రెడ్డి గట్స్ ఉన్న సీఎం.. అందుకే హీరోను అరెస్ట్ చేయగలిగారు : పవన్ కల్యాణ్
నెహ్రూ, ఇందిరకు భారత రత్న ఇచ్చిన కాంగ్రెస్, బాబా సాహెబ్ అంబేద్కర్కు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఫొటోను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఆయనను ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడించిందని ప్రశ్నించారు. నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఉంటే సీఎం ఎందుకు దండ వేయడం లేదని సూటిగా అడిగారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మోడీ కాబట్టే ఢిల్లీలో చేశారని, కాంగ్రెస్ ఉంటే వేరే చోట చేసేవారని, పీవీలాగే మన్మోహన్ సింగ్కు అవమానం జరిగేదని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ను మన్మోహన్కు దక్కకుండా సోనియాను దేవత చేశారని, మన్మోహన్ను అవమానించింది, రబ్బర్ స్టాంప్ లాగా మార్చింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.