కేసీఆర్ ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా అంటూ ‘కేసీఆర్ ఝూఠా మాటలు’ పోస్టర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలతో కలిసి పోస్టర్లను రిలీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి పచ్చి అబద్ధాలు, మోసాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ మండిపడ్డారు. మందు, మాంసం, మనీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ ఝూఠా మాటలు మచ్చుకు కొన్ని..
తెలంగాణ ప్రజల భవిష్యత్తు మునుగోడు ఎన్నిక ఫలితాలపై ఆధారపడి ఉందని బండి సంజయ్ చెప్పారు. ఈనేపథ్యంలో కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లను ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ , సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని పోస్టర్ ద్వారా ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని, ప్రతి మండలంలో అంబేద్కర్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తానని సీఎం గతంలో చెప్పారు. ఇన్నేండ్లు గడిచినా ఆ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొంటానన్నారు
బంగారు తెలంగాణలో రైతు ఆత్మహత్యలుండవని చెప్పిన సీఎం కేసీఆర్..రైతులు పండించిన ధాన్యాన్ని ఆఖరి గింజవరకు తామే కొంటామని గొప్పలు చెప్పి తర్వాత మాట మార్చారని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చారో చూపించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ రూ.3,016 నిరుద్యోగ భృతి అందిస్తానని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.
నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కాలేజీ ఏమైంది?
నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కాలేజీ కట్టిస్తానని చెప్పిన కేసీఆర్.. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య తప్పకుండా అమలు చేస్తానని చెప్పి విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని..యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేశారని పోస్టర్లలో ప్రశ్నించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి తానే వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వచ్చారా అంటూ ప్రశ్నించారు.తెలంగాణలో ప్రతి లంబాడీ తండాలో, ప్రతి గోండు గూడెంలో ఊరికి దూరంగా ఉండే బస్తీల్లో, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా పెట్టించి, మంచినీళ్లు తెస్తానని.. ఆ మంచి నీళ్లతోనే మీ పాదాలు కడుగుతా, కడిగినంకనే ఓట్లు అడుగుతానన్నారు. కానీ ఇందులో ఏ ఒక్కహామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు.
అమరుల కోసం చేసిందేమిటి?
ట్యాంక్‌బండ్ పై అమరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తానని హామీలు గాలికి వదిలేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ ను చూస్తే పాత భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెల్వని పరిస్థితుల్లో ఉండటం చూస్తే బాధనిపించిందన్నారు. అక్కడ వున్న డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు, విద్యార్థుల ప్రాణాలను కాపాడటానికి ఆసుపత్రిని కొన్నిరోజుల్లో షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆ ప్లేస్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు నిర్మించారా అని ప్రశ్నించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదు
ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్ కట్టిస్తానని ఎందుకు కట్టించలేదని బండి సంజయ్ నిలదీశారు.ప్రతి నియోజకవర్గానికి100 పడకల ఆస్పత్రి, ప్రతి మండలానికి 30 పడకల దవాఖానా కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినంక అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేసి ఖాళీ చేద్దాం మంచినీటితో నింపుదామని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని చెప్పి ఎందుకు తెరిపించలేదని బండి సంజయ్ పోస్టర్లలో ప్రశ్నించారు.