- రాష్ట్ర సర్కార్ కు విజ్ఞప్తి
కరీంనగర్ సిటీ, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 18 ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలతో నెట్టుకొస్తున్నారని, రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ లోని ఎంపీ ఆఫీసులో ఆయనను సోమవారం రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆర్టిజన్ల డిమాండ్ న్యాయమైనదేనన్నారు. ఆర్టిజన్లను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చడం ఎంతవరకు సమంసజమని ప్రశ్నించారు. అదేవిధంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రబియా బేగం, దోసపాటి సరిత వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్ల డిమాండ్లు న్యాయమైనవేనని, కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.