తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి మూడోసారి అధికారం ఇస్తే పేదల బతుకులు బర్బాద్ అవుతాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే రెండుసార్లు అధికారమిస్తే ప్రజలకు ఆ పార్టీ ఏమీ చేయలేదని ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొక్కలోనిపల్లి, జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. పాలమూరులో అధికార పార్టీ నేతలు ఓటుకు రూ.10 వేలు పంచేందుకు సిద్ధమయ్యారని సంజయ్ ఆరోపించారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఇక్కడి మంత్రి అవినీతి, భూ కబ్జాలతో వందల కోట్లు సంపాదించారన్నారు. పాలమూరు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేంటంటే.. ఊరూరా బెల్టు షాపులు పెట్టి మందు తాగిస్తున్నారని విమర్శించారు. ఒక్కో తలపై రూ.1.20 లక్షల అప్పు చేశారని, మళ్లీ ఆయనకు అధికారం ఇస్తే రూ.2.80 లక్షల అప్పు ఒక్కొక్కరి నెత్తిపై పెడతారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ అప్పులన్నీ తీరి, న్యాయం జరుగుతుందని చెప్పారు.
కమీషన్ల కోసమే ‘పాలమూరు’ స్కీం..
రాష్ట్రానికి కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాకపోగా, ‘పాలమూరు’స్కీం పేరుతో కమీషన్లు దండుకున్నారని సంజయ్ ఆరోపించారు. రాయలసీమకు పోయి కృష్ణా నీటిని ఏపీకి తాకట్టు పెట్టి, పాలమూరు ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. కృష్ణా నది ద్వారా రాష్ట్రానికి 595 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకొ ని సంతకాలు చేశారన్నారు. కేంద్రం ట్రిబ్యునల్ వేస్తామని చెప్పినా కూడా సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు వాపస్ తీసుకోలేదని గుర్తుచేశారు.
తప్పులన్నీ కేసీఆర్ చేసి.. మోదీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ట్రిబ్యునల్ వేసింది మోదీనేనని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఎన్నడైనా పేదల కోసం కొట్లాడి జైలుకు పోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల మంది రైతులు, లక్షలాది మంది మహిళలు, విద్యార్థులు బీజేపీకి ఓటు వేసి, గెలిపించాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని ప్రయత్నిస్తుండటంతో వాళ్ల ఇంట్లో కొట్లాటలు ఎక్కువయ్యాయన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
రాజకీయాల కంటే నాకు ధర్మమే ముఖ్యం..
తనకు రాజకీయాల కంటే ధర్మమే ముఖ్యమని, హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు కూడా వెనుకాడనని బండి సంజయ్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనలాంటోడు, రాజాసింగ్ లాంటి వాళ్లను గెలిపించకపోతే ఇకపై హిందూ ధర్మం గురించి మట్లాడే వారే ఉండరన్నారు. శుక్రవారం కరీంనగర్ సుభాష్ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
‘‘ఇవ్వాల కేసీఆర్ వచ్చి ఏమన్నడు.. నాకు మత పిచ్చి ఉందట.. మరి నీకు మందు పిచ్చి.. నన్ను మతపిచ్చి అన్నా.. మత తత్వవాది అన్నా.. నేను వెనుకడగు వేయను. బరాబర్ హిందూ ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా’’అని సంజయ్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోని కేసీఆర్‌కు వాటి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇవ్వాల కేసీఆర్ వినోద్ రావు గురించి మాట్లాడుతున్నారని, కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకరా.. లేక వినోద్ రావా.. అని సంజయ్ ప్రశ్నించారు.
వినోద్ రావు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొ చ్చినట్లు చెబుతున్నారని, స్మార్ట్ సిటీ నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు. కరీంనగర్– వరంగల్, కరీంనగర్– జగిత్యాల హైవేతోపాటు తీగలగుట్టపల్లి ఆర్వోబీ, రైల్వే లైన్ నిధులన్నీ తానే తీసుకొచ్చానని, కానీ కొబ్బరికాయ కొట్టి ఫోజులు కొట్టింది మీరని సంజయ్ మండిపడ్డారు.