ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ కు అండగా ఎంఐఎం ఉందని, బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ మినహా ఎక్కడా పోటీ చేసే దమ్ము లేదన్నారు. రాష్ర్టంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి.. వారి జీవితాలను ఎంఐఎం పార్టీ నాశనం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీని పెద్దగా చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. రాష్ర్టంలో బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు (బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఐఎం) ఒక్కటవుతున్నాయని ఆరోపించారు.
పాతబస్తీని ఎంఐఎం పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అన్ని పార్టీలతో ఎంఐఎం కలిసి పనిచేసినా.. ఓల్డ్ సిటీని ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పటికీ అక్కడ ఒక్క కంపెనీ కూడా ఎందుకు రాలేదన్నారు. కుటుంబ సభ్యుల ఆస్తులను పెంచుకోవడం, కాపాడుకోవడమే ఎంపీ అసదుద్దీన్ లక్ష్యమని ఆరోపించారు. దమ్ముంటే అన్ని చోట్ల ఎంఐఎం పోటీ చేయాలని సవాల్ విసిరారు. దారుస్సలాంలో కూర్చుని మాట్లాడటం కాదని, దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తన తమ్ముడు అక్బరుద్దీన్ గతంలో హిందువులపై చేసిన వాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంత శక్తివంతంగా ఉందో అసదుద్దీన్ వ్యాఖ్యలతోనే స్పష్టమైందన్నారు.
కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. కరీంనగర్ లో టీటీడీ ఆలయం నిర్మించడం సంతోషకరమన్నారు. హిందూ ధర్మ రక్షణకు టీటీడీ ఎన్నో మంచి కార్యాలు చేస్తోందన్నారు. కరీంనగర్ లో ఆలయం నిర్మించడం వల్ల తిరుపతికి వెళ్లలేని పేద భక్తులు ఇక్కడే స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో తన యాత్ర గురించి పార్టీలో అందరూ కలిసి కూర్చుని నిర్ణయిస్తామని తెలిపారు.