- తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ సుద్దపూస కాదని, ఆయన బాగోతం ప్రజలందరికీ తెలుసునని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నోటీసుల పేరుతో కేటీఆర్ చేసే తాటాకు చప్పుళ్లకు తాను భపడేది లేదని తెలిపారు. కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ బుధవారం స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్ నోటీసులు పంపడం చూస్తుంటే జాలేస్తున్నదని అన్నారు. తనకు నోటీసు పంపించినట్టు మీడియాలో చూశానని తెలిపారు.
కేటీఆర్ ముందుగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించాడని, దానికి బదులుగానే తాను మాట్లాడినట్టు వెల్లడించారు. కేటీఆర్గురించి ప్రజలందరికీ తెలుసునని, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరూ గమనించారని చెప్పారు. ఇప్పటివరకూ తాము మాటకు మాటతోనే బదులిచ్చామని, తాము చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని అన్నారు. చట్టం, న్యాయం ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ‘కేటీఆర్.. నీకూ నోటీసులు పంపిస్తా కాచుకో” అని సవాల్ విసిరారు.
కేటీఆర్.. నీకు వంద నోటీసులు పంపాలె : ప్రకాశ్ రెడ్డి
కేటీఆర్ ఆట మొదలుపెట్టారని, దాన్ని తాము ముగిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో నోటీసులే సమాధానమైతే కేటీఆర్కు వంద నోటీసులు పంపాలని అన్నారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ నాయకులపై కేటీఆర్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు, బూతు పురాణాలను చూస్తే ఎన్ని నోటీసులు ఇవ్వచ్చో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పారు. తాము లీగల్ నోటీసులివ్వడం ప్రారంభిస్తే.. కేటీఆర్ పారిపోయే రోజులు వస్తాయని అన్నారు. ప్రజలు, నాయకులను అవమానిస్తూ బూతు మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ నేతలకు త్వరలోనే తగిన సమాధానం చెప్తామని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు.
నోటీసులకు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదని, ధీటుగానే బదులిస్తామని స్పష్టం చేశారు. దొరహంకార, దురహంకార వైఖరి వల్లే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను దిగిపొమ్మని జడ్జిమెంట్ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలకు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు తాము ఎన్ని నోటీసులివ్వాలో చెప్పాలని ప్రశ్నించారు.