జోగులాంబ గద్వాల : దేశ చరిత్రలో కేసీఆర్ లాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదని బండి సంజయ్ అన్నారు. ఆయన లేని సమస్యను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటాడని, అందుకు వడ్ల కొనుగోలు వ్యవహారమే సాక్ష్యమని అన్నారు. యాసంగి పంటనంతా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతున్నా.. నిరుద్యోగుల కోపాన్ని, కరెంటు ఛార్జీల పెంపుపై జనంలో ఉన్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు వడ్ల సమస్యను తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నాడని విమర్శించారు. బీజేపీని బద్నాం చేసేందుకు ఢిల్లీ పోయి ధర్నాలు చేసి, చివరకు మేమే కొంటామని గప్పాలు కొట్టిండని ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడంపై సంజయ్ మండిపడ్డారు. పండించిన పంటనంతా కేంద్రమే కొనాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని ఆయన బయటపెట్టారు. ఒకవైపు మేమే కొంటామని చెబుతూనే మరోవైపు కేంద్రమే కొనాలని ఏప్రిల్ 13న రాసిన లేఖను ఆయన చూపారు. యాసంగిలో 40.22 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ వస్తాయని, వాటన్నింటినీ కేంద్రానికి పంపిస్తామని లేఖలో ప్రస్తావించారని అన్నారు. ధాన్యం నేనే కొంటానన్న మొనగాడు ఇప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని బండి సంజయ్ ప్రశ్నించారు.
రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అందరినీ ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో డ్రామాలాడి రైతులను అరిగోస పెట్టిండని మండి పడ్డారు. ఆలంపూర్ నియోజకవర్గంలోని బోరవెల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసినచ్చిన కేసీఆర్.. ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారని అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. 2020-21 సంవత్సరానికి ఇవ్వాల్సిన 9 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా ఎందుకు ఇయ్యలేదో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.