- బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే
- 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచేలా కేసీఆర్ ప్లాన్
- దేశద్రోహులతో స్నేహమే కాంగ్రెస్ సిద్ధాంతమని విమర్శ
- కేంద్రం నుంచి లబ్ధి పొందినోళ్లు సెల్ఫీలు పెట్టాలి: జవదేకర్
కరీంనగర్/వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని, రాష్ట్రంలో 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల గెలుపు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బీజేపీస్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావాలని చూస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ బలంగా లేనిచోట కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వేములవాడలోని భీమేశ్వర గార్డెన్ లో ఆదివారం మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో కలిసి బీజేపీ సీనియర్ కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందన్నారు. దోచుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమని, దేశద్రోహులతో స్నేహం చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. ప్రధాని మోడీ పాలనలో 9 ఏండ్లలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినా, కేంద్రం నిధులియ్యడం లేదంటూ దుష్ప్రచారం చేస్తోందన్నారు. మోడీ పాలనలో రాష్ట్రానికి జరిగిన మేలును కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు.
సెల్ఫీ వీడియోలు పెట్టాలె..
కేంద్రం ద్వారా లబ్ధి పొందిన వారంతా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. ‘‘కరోనా సమయంలో ప్రజలను కాపాడేందుకు కేంద్రం కరోనా వ్యాక్సిన్ అందించింది. ఆత్మనిర్బర్ భారత్ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతు అకౌంట్లో ఏటా రూ. 6 వేలు జమచేస్తోంది. ఒక్కో ఎకరాకు రూ. 24 వేలు ఎరువుల సబ్సిడీని భరిస్తోంది. ముద్ర లోన్లు, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు కూడా ఎంతో మేలు చేశాయి”
అని ఆయన తెలిపారు. కరీంనగర్ లోని ఓ హోటల్ లో మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని, తెలంగాణపై ఎలాంటి భేదభావాలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పర్యావరణ శాఖ మంత్రిగా రెండు వారాల్లోనే పర్మిషన్ ఇచ్చానన్నారు. రాష్ట్రానికి రెండు స్మార్ట్ సిటీలను ఇచ్చామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, నేతలు లగిశెట్టి శ్రీనివాస్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, కుమ్మరి శంకర్, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సేవలో సంజయ్, జవదేకర్
వేములవాడ పర్యటన సందర్భంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బండి సంజయ్, జవదేకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచనం అందజేసి, సత్కరించారు.
రాజేశ్వర్ రావు, వారాల ఆనంద్కు సన్మానం
మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావును ఆయన నివాసంలో బండి సంజయ్, జవదేకర్ వెళ్లి కలిశారు. డెయిరీ రంగంలో విశేష కృషి చేస్తున్నందున ఆయనను సన్మానించారు. సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ డెయిరీని తన మేధాశక్తితో విజయపథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. సమాజ అభివృద్ధికి ప్రముఖులు, మేధావుల సూచనలు ఎంతో అవసరమని, వారిని ప్రోత్సహించి, తగిన విధంగా సత్కరించుకోవడం మనందరి బాధ్యతన్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త, జాతీయ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ ను కూడా వారు కలిసి సన్మానించారు.