సాగునీటిపై బీఆర్ఎస్​, కాంగ్రెస్​ డ్రామాలు: బండి సంజయ్​

కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/ వీర్నపల్లి, వెలుగు: కృష్ణా జలాల పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. ప్రజాహిత యాత్రలో భాగం గా మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో పర్యటించారు. వీర్నపల్లిలో బీజేపీ లీడర్‌‌ రాణిరుద్రమ ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. సంజయ్ మాట్లాడుతూ, కాళేశ్వరంపై ఇప్పటికే ఇంజినీర్లు, మంత్రులు నివేదిక ఇచ్చారని..సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మళ్లీ అక్కడికి వెళ్లి చూడాల్సిన అవసరమేముందన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.

ప్రజలకు కేసీఆర్ చేసిం దేమీ లేదని, పేదల రక్తం తాగినందుకు శాపం తగిలి అధికారం పోయిందన్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలని, ఎమ్మెల్యేలను ఎలా కొనాలని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్​పాస్ పోర్ట్​ల బ్రోకర్ అని, కొనుక్కొచ్చుకున్న కారుకు కిస్తీలు కట్టకుండా దాచి పెట్టాడన్నారు. కృష్ణా జలాల్లో అప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మిలాఖతై  800 టీఎంసీల నీళ్లను ఆంధ్రకు మళ్లించారని, అడిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు 400 టీఎంసీలను మళ్లించినట్లు చెప్పడం సిగ్గుచేటన్నారు.ఇద్దరు కలిసి మొత్తం 1200 టీఎంసీలను పక్క రాష్ట్రానికి పంపించారని విమర్శించారు. దీనిని సాక్ష్యాత్తు ఆ రాష్ట్ర సీఎం  జగన్​ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ట్విట్టర్ టిల్లు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ప్రజల కోసం కేసీఆర్‌తో కొట్లాడితే తనపై వందల కేసులు పెట్టి జైలుకు పంపారని, జనం మాత్రం ఓట్లు కాంగ్రెస్ కు వేశారన్నారు.