బీఆర్ఎస్ పనైపోయింది : బండి సంజయ్

బీఆర్ఎస్ పనైపోయింది :  బండి సంజయ్
  • ఆ పార్టీ లీడర్లంతా 'గోపి'లయ్యారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
  • పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి
  • యూఎస్​లోని ఎన్నారైలతో  జూమ్ ద్వారా మాట్లాడిన మంత్రి

కరీంనగర్/బోయినిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనంలోకి వచ్చి మొఖం చూపించలేక ఫాంహౌస్​ కే పరిమితమయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ కు క్యాడర్ లేకుండా పోయిందని, ఆ పార్టీ లీడర్లంతా ఏ పార్టీలోకి వెళ్దామా అని గోడమీద పిల్లిలా ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' అసోసియేషన్ కు చెందిన ఎన్నారైలతో సంజయ్ సోమవారం 'జూమ్' ద్వారా మాట్లాడారు.

'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నయ్. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోంది' అని వ్యాఖ్యానించారు. 

 సీఎం ఇస్తున్న హామీలకు, చెప్తున్న మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్.. కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనన్నారు. 

 కేసీఆర్​ సర్వే వివరాలు బయట పెట్టాలి..

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి సర్వే కన్నా ముందు.. కేసీఆర్ హయాంలో  చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టాలని బండి సంజయ్ అన్నారు.  సర్వే రిపోర్ట్ తో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారని..  సీఎం రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ తెప్పించుకోవాలని, లేదంటే సర్వేకు ఐన ఖర్చును కేసీఆర్​నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. 

సోమవారం సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఎంపీ నిధులతో  ఏర్పాటు చేసిన బోటును ప్రారంభించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అప్పట్లో సర్వే కోసం విదేశాల్లో ఉన్నవారు కూడా పరుగుపరుగున వచ్చి వివరాలు చెప్పారన్నారు. ఈ సర్వేకు అలాంటిదేనని, ఎవరి కులం, మతం మారదని, ఇవన్నీ  టైం పాస్ పాలిటిక్స్ అయ్యాయన్నారు. వడ్ల కొనుగోలు వెంటనే  చేపట్టాలని, లేకపోతే  రైతులు నష్టపోతారని అన్నారు. కేటీఆర్ పాదయాత్ర ఎందుకో అతనికే తెలియాలన్నారు.