హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ మూర్ఖపు వైఖరికి ఒక రైతు బలి కావడం విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. బుధవారం రైతు మృతదేహం తరలింపు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా కలెక్టర్, పోలీసులు భావించొద్దు. మీరు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారని, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.‘‘బారికేడ్లు, కంచెవేసి రైతుల్ని అడ్డుకోవడం సిగ్గుచేటు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఉగ్రవాదులుగా, సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తున్నది. సీఎంకు ఎవరినీ కలిసే తీరిక లేదు. కనీసం జిల్లా కలెక్టర్లకు కూడా రైతుల్ని కలిసే సమయం లేదా..?’’ అని ప్రశ్నించారు.
పోలీసు అభ్యర్థుల గోడు వినే టైం లేదా?
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్షల అభ్యర్థుల అరెస్టును సంజయ్ ఖండించారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్కి బానిసల్లా పోలీసులు: డీకే అరుణ
కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం, అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా పని చేస్తున్నారని ఆరోపించారు.