అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదన్నారు బండి సంజయ్. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే ఉద్దేశంతో.. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు చేయడం అందులో భాగంగా కనిపిస్తోందన్నారు. ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో... అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలని చెబుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని తెలిపారు. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబం మాత్రమే రాజ్యం ఏలాలన్నది కేసీఆర్ కుట్రగా కనిపిస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు... సీఎం పీఠంపై కూర్చునే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 105 సార్లు సవరణలు చేశారు. కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని తిరగరాయాలని అంటున్నారంటే కేసీఆర్ లో ఉన్న అహంకార భావం ఏ విధంగా ఉందో కనిపిస్తోందన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు స్పందించాలన్నారు. 317 జీవో, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ సహా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా న్యాయవాదులు పోరాడాలని కోరారు బండి సంజయ్.
మరిన్ని వార్తల కోసం