- మునుగోడు ప్రజలు తేల్చుకోవాల్సిన టైమొచ్చింది: బండి సంజయ్
చండూరు (నాంపల్లి) వెలుగు: ఆపదలో ఆదుకునే వారు కావాలో, నట్టేట ముంచేవారు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘‘మునుగోడు బైపోల్‌లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు మంచి వారో, ఎవరికి సాయం చేసే గుణం ఉందో మీరే ఆలోచించండి. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకొని, పువ్వు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ బాక్సును బద్దలు కొట్టినట్లు తీర్పు ఇవ్వాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఎస్.లింగోటంలో నిర్వహించిన ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్‌ను లెంకలపల్లికి గుంజుకొచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మునుగోడుకు వస్తున్నారని ఆరోపించారు.
సొమ్మునంతా కక్కించాలె
కుల, వర్గం, వర్ణాల పేరుతో ప్రజలను చీల్చేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఓటుకు రూ.40 వేలు మీకు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు ప్యాకెట్లు రెడీ చేస్తున్నారు. దుబ్బాకలో రూ.10 వేలు, హుజూరాబాద్‌లో 20 వేలు ఇచ్చారు. మునుగోడులో రూ.40 వేలు ఇవ్వబోతున్నారు. పైసలు లెక్కపెట్టి మరీ తీసుకోండి.. కేసీఆర్ సంపాదించిన సొమ్మునంతా కక్కించి ఇక్కడ పంచడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు” అని బండి సంజయ్ అన్నారు. ‘‘నాంపల్లి నుంచి అడుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మండలంలో ఎన్ని ఇండ్లు కట్టించి ఇచ్చావో, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో.. ఏం అభివృద్ధి చేశావో చెప్పు” అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగం రాని, ఉపాధి దొరకని యువకులు, దళిత బంధు రాని వారు, నిరుద్యోగ భృతి అందని వారు, చేనేత బంధు అందని వారు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందని వారంతా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కర్రు కాల్చి వాత పెట్టినా కేసీఆర్‌కు సిగ్గు రాలే
‘‘బతికుండగానే మన సమాధి కట్టి, అక్కడ మన ఫొటో పెడితే కుటుంబ సభ్యులు బాధపడతారా లేదా? మరి టీఆర్ఎస్ ఫాల్తుగాళ్లను ఏమనాలె? నిజాయితీకి నిలువుటద్దం లాంటి వ్యక్తి జేపీ నడ్డా. ఆయన పేరుతో సమాధి కట్టిన టీఆర్ఎస్ నేతలను ఏం చేయాలె? కేసీఆర్‌ను ఏం చేయాలె? ఇట్లాంటివి సహించే ప్రసక్తే లేదు” అని సంజయ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లతో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారమైందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఫ్లోరోసిస్ సమస్యపై నడ్డా పేరుతో సమాధి ఎట్లా కట్టావని ప్రశ్నించారు. గొల్ల కురుమలకు ఇచ్చిన నగదును సీజ్ చేయాలని తాను ఈసీకి లేఖ రాసినట్లు మళ్లీ అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో వరద సాయంపై, హుజూరాబాద్ లో దళిత బంధుపై ఇట్లనే అబద్ధాలాడితే జనం కర్రు కాల్చి వాత పెట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, నేతలు రాపోలు ఆనంద భాస్కర్, నరసయ్య గౌడ్, ప్రదీప్, ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీరాములు, రితీష్ రాథోడ్, ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రాక్షస పాలనకు చరమగీతం పాడాలి: వివేక్
కల్వకుంట్ల కమీషన్ రావును గద్దె దించడానికి మునుగోడు ప్రజలు కంకణ బద్ధులై సిద్ధంగా ఉండాలని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రజలను వదిలేసి తన ఫ్యామిలీని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకున్న అవినీతిపరుడు కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని ఆరోపించారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని మోసపూరిత మాటలు చెప్పి.. కుటుంబానికి నిర్మించుకున్నాడని ఫైర్ అయ్యారు. పేద ప్రజలకు సాయం చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలన్నారు. రజాకార్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు.