అవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదలం: సంజయ్​

  • అధికారంలోకి వచ్చినంక వారి లెక్కలు తీస్తం 
  • కాంగ్రెస్  గ్రాఫ్​  పెంచేందుకు సీఎం యత్నిస్తున్నరు
  • బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాని సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులకు నెలనెలా డబ్బులు
  • అధికార పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్  కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారంతా జైలుకు వెళ్లడం పక్కా అని బీజేపీ స్టేట్  చీఫ్​ బండి సంజయ్ అన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. మహాజన్  సంపర్క్  అభియాన్  కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్  మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆ నియోజకవర్గంలో  బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంజయ్  చీఫ్​  గెస్టుగా హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ను జాకీ పెట్టి లేపినా లేవలేని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీ  గ్రాఫ్  పెంచడానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు డిపాజిట్లు రాని 30 చోట్ల  కాంగ్రెస్ తరఫున పోటీచేసే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారని, కాంగ్రెస్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన నాయకులంతా పోస్టు పెయిడ్ నాయకులని, గెలవకపోయినా బీఆర్ఎస్ లోకి వెళ్లే నేతలంతా ప్రీ పెయిడ్ నేతలని విమర్శించారు. ఇక నిమ్స్ లో రెండు వేల పడకల ఆస్పత్రికి కేసీఆర్  శిలాఫలకం చేశారని, కేసీఆర్ ఇప్పటి వరకు వేసిన శిలాఫలకాలతో ఏకంగా ఉస్మానియా ఆస్పత్రినే కట్టవచ్చన్నారు. కేసీఆర్  రూ.వేల కోట్లు సంపాదించి విదేశాల్లో దాచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ధరణితో పేద రైతుల బతుకులు నాశనం అవుతున్నాయి. పేదల‌‌‌‌‌‌‌‌ పాలిట ధరణి శాపంగా మారింది. దాంతో లాభపడింది కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్  నేతలు మాత్రమే. ధరణి పోర్టల్ కు, రైతుబంధుకు సంబంధం ఏంటో  కేసీఆర్ చెప్పాలి.

తెలంగాణలో బీఆర్ఎస్  దుకాణం బంద్  కానుంది. ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు సీట్లే వచ్చాయి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్  మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో కాంగ్రెస్  ఔటయింది” అని సంజయ్  వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. డబుల్  ఇంజన్  సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిపరుల లెక్కలు తీస్తామని సంజయ్  హెచ్చరించారు.

బీఆర్ఎస్​తో పొత్తు కోసం రేవంత్  యత్నం: తరుణ్ చుగ్

బీఆర్ఎస్​తో పొత్తు కోసం పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్  అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. కేసీఆర్  ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, నియంత పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ సంపదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన ఫైర్​ అయ్యారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, దళితులను బీఆర్ఎస్  సర్కారు దగా చేస్తున్నదని అన్నారు. కేసీఆర్  సర్కారుది 30 శాతం కమీషన్  సర్కార్​ అని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్​కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకువస్తున్నారన్నారు.

సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, తన బలం, బలగమంతా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలే అన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్, మల్లారెడ్డి, మేడ్చల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు హరీశ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్  నియోజకవర్గ  బీజేపీ కార్యాలయాన్ని బండి సంజయ్  ప్రారంభించారు.