బీఆర్ఎస్ ఓడిపోయే స్థానాల్లో.. కాంగ్రెస్​ అభ్యర్థులకు డబ్బులిస్తున్నరు: బండి సంజయ్

  • బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లు రావు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే..
  • అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నరని విమర్శ

కరీంనగర్/మానకొండూరు, వెలుగు : బీఆర్ఎస్ ఓడిపోయే స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు, ఇండిపెండెంట్లకు సీఎం కేసీఆర్ డబ్బులిస్తున్నారని, వాళ్లు గెలవగానే బీఆర్ఎస్ లో చేర్చుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో రామగుండం, భూపాలపల్లిలో ఇలాగే చేశారన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి సీఎం కేసీఆర్ పైసలు ఇస్తున్నారని నేను మొన్ననే అన్న. ఇయ్యాల కాంగ్రెస్ పార్టీలో తమ వాళ్లే ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నరు. కాంగ్రెస్ పార్టీకి పైసలిస్తున్నామని.. మేం మేం ఒక్కటేనని బీఆర్ఎస్ వాళ్లే క్లారిటీ ఇచ్చారు”అని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లు ఇవ్వరని, ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఉంటదో అక్కడ ప్రత్యర్థికి డబ్బులు కేసీఆర్ సాయం చేస్తారని ఆరోపించారు.

దళిత సమాజాన్ని మోసం చేసింది కాంగ్రెస్సే..

దళిత సమాజాన్ని మొదటి నుంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, అధికారంలోకి రాని కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా వృథానే అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దళిత డిక్లరేషన్ తో దళితులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ కు పోటీ చేస్తే ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ జన్మ స్థలం, చదువుకున్న స్థలం, దీక్ష చేసిన స్థలం, సంగ శ్రేయ స్థలం ఇలా పంచ తీర్థాల పేరుతో అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. 

ఈ కార్యక్రమంలో అస్సాంలోని కమల్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దిగంత కలిత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ముత్యాల జగన్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ గడ్డం నాగరాజు, మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.