- బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. గతంలో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను పరాయి పాలకులు పక్క రాష్ట్రానికి దోచిపెడితే, స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పాలకులే స్వార్థ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికి నీటిని తాకట్టు పెట్టారని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
అమరుల బలిదానాలతో ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామ న్నారు. ఉద్యమించిన ప్రతిఒక్కరికీ ఆయన అభినంద నలు తెలిపారు. గత కేసీఆర్ సర్కారు ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిందని ఫైర్ అయ్యారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేసిండు. అవినీతి, నియంత, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు.
బీఆర్ఎస్ పాలకులను గద్దె దించి పదేండ్ల పాలన పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కారు కూడా సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆరు గ్యారంటీలు సహా ఎన్నికల హామీలన్నీ తుంగలో తొక్కారు” అని సంజయ్ పేర్కొన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లు సహా కన్పించిన ప్రతి దాంట్లోనూ కమీషన్లు దండుకోవడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.