కరీంనగర్ అభివృద్ధికి పొన్నం, గంగులతో కలిసి పనిచేస్త: బండి సంజయ్

  • మిగిలిన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేయిస్త: బండి సంజయ్​
  • సంజయ్​కి కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​, ఎంఐఎం కార్పొరేటర్ల సన్మానం

కరీంనగర్, వెలుగు : కరీంనగర్  కార్పొరేషన్ అభివృద్ధి కోసం మేయర్ సునీల్ రావు ఇటీవల  అద్భుతమైన ప్రణాళికను తన ముందుంచారని, దాని అమలు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి చర్చిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.

కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని చెప్పారు. స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం పొడిగించిన నేపథ్యంలో బండి సంజయ్​ని కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపే కార్పొరేటర్లు ఆదివారం ఘనంగా సన్మానించారు.  మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలోనూ సత్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ అభివృద్ధికి  కసితో పని చేస్తానని చెప్పారు. ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని, అందరూ కలిసి సన్మానిస్తారని తాను ఊహించలేదని, ఇది తనకెంతో సంతోషానిచ్చిందని అన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం రూ.934 కోట్లు మంజూరైతే అందులో రూ.765 కోట్లు ఇప్పటికే వచ్చాయని, ఇంకా రూ.176 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. అందులో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద  రూ.100 కోట్ల వరకు రావాలని, కేంద్రం నుంచి రూ.70 కోట్లు వస్తాయని, వాటిని తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా?

ఇతర పార్టీలోనుంచి చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా? అని కాంగ్రెస్​కు  బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నామని అనడం సిగ్గు చేటని పేర్కొన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కుట్రలో భాగమేనని చెప్పారు. బీఆర్ఎస్ ను కాపాడుకోవడానికి కేసీఆర్, దొంగ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. 

బీఆర్​ఎస్​ హయాంలో దాడులు మర్చిపోలేదు

కేసీఆర్ హయాంలో తనతోపాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింసను ఎవరూ మర్చిపోలేదని బండి సంజయ్​ తెలిపారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే  పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీని 8  స్థానాల్లో గెలిపించారని తెలిపారు. నిరుద్యోగ సమస్య చాలా సున్నితమైందని, దానిని చాలా స్మూత్ గా డీల్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. వన్ టైం సెటిల్ మెంట్ అంటే.. యాజమాన్యాలు కూడా విద్యార్థుల దగ్గర వన్ టైం సెటిల్​మెంట్​ అని ఫీజులు వసూలు చేస్తాయని వెల్లడించారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.