చండూరు సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. బీసీ ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కులాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందన్నారు. వడ్డెర కులస్తులు, విశ్వకర్మలు, దళితుల కోసం కేసీఆర్ ఏం చేశారన్నారు. దళితబంధు ఏమైందన్నారు. ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. పోడు భూముల విషయం చండూరు సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదన్నారు.
డ్రైవర్లుగా మారిన యువకులు
మునుగోడులో ఎంతో మంది యువకులు పెద్ద చదువుల చదివి హైదరాబాద్ లో డ్రైవర్లుగా మారారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ లిస్ట్ విడుదల చేయాలన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాల ద్వారా ఎంత మంది లబ్దిపొందారో చూడాలన్నారు.
ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి..
కేసీఆర్ నిర్ణయం వల్ల 34 మంది ఆర్టీసీ కార్మికులు బలయ్యారని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం అశ్వద్ధామ రెడ్డి బలయ్యారని చెప్పారు. అశ్వద్ధామ రెడ్డి తన ఉద్యోగాన్ని కోల్పోయారని తెలిపారు. ఓటు వేసేముందు ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని కోరారు.
ప్రమోషన్లు లేవు..
తమ స్వప్రయోజనాల కోసం ఇద్దరు ముగ్గురు టీఎన్జీవో నేతలు ఉద్యోగాల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లేవన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని గుర్తు చేశారు. కేసీఆర్కు తొత్తులుగా టీఎన్జీవోలో ఇద్దరు ముగ్గురు నేతలు మారారని మండిపడ్డారు.