రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ సహా 12 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు డగ్స్ తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక..అందరికి వీరందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ గద్దె దిగాక..తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తామన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లక్ష్మీనరసింహస్వామి పేరు ఉచ్ఛరించినందుకు కేసీఆర్, కేటీఆర్ నోరును సంప్రోక్షణ చేయాలన్నారు.
తప్పు చేయకుంటే ఎందుకు రాలేదు..
బీజేపీ తప్పు చేయలేదు కాబట్టే తాను..యాదగిరిగుట్టకు వెళ్లి తడబట్టలతో ప్రమాణం చేశానని బండి సంజయ్ తెలిపారు. తాను ప్రమాణం చేయడం వల్లే బీజేపీ నిజాయితీ ప్రజలు తెలిసిందన్నారు. కేసీఆర్ తప్పు చేయకుంటే యాదగిరిగుట్టకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎందుకు తన సవాల్ను స్వీకరించలేదన్నారు. కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టే..గుట్టకు రాలేదన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు గత మూడు నాలుగు రోజులుగా ప్రగతి భవన్లోనే ఉన్నారని...తప్పుచేయకపోతే వారిని ప్రగతి భవన్లో దాచాల్సిన అవసరం ఏముందన్నారు.
తెలంగాణ ద్రోహి
సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని బండి సంజయ్ మండిపడ్డారు. మునుగోడు ప్రాంత ప్రజల ఇబ్బందికి కారణం కేసీఆరే అని చెప్పారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా 575 టీఎంసీలు ఉంటే..అప్పటి ముఖ్యమంత్రితో కేసీఆర్ కుమ్మక్కై...299 టీఎంసీలకే ఒప్పుకున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రాంతాన్ని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ డబ్బులతో కాంగ్రెస్ ప్రచారం...
మునుగోడులో టీఆర్ఎస్ డబ్బులతో కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు..గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీది జోడో యాత్ర కాదని..టీఆర్ఎస్ కాంగ్రెస్ జోడు యాత్ర అని చురకలంటించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీని ఆపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అమిత్ షా సభ సమయంలో, రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సమయంలో కావాలనే ట్రాఫిక్ను సృష్టించారని చెప్పారు. అక్టోబర్ 31న - ఒకే రోజు 9 బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని విషయాలను ప్రజలు వివరించి ఓట్లు అభ్యర్థిస్తామన్నారు.