హైదరాబాద్‌లో సర్థార్ వల్లభాయ్ పటేల్​విగ్రహం :బండి సంజయ్​

హైదరాబాద్‌లో సర్థార్ వల్లభాయ్ పటేల్​విగ్రహం :బండి సంజయ్​

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్​లో సర్దార్​ వల్లభాయ్​ పటేల్ ​విగ్రహాన్ని పెట్టితీరుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​తెలిపారు. ‘‘పిడెకెడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎంకు భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఉద్యమ పార్టీ అవుతుందా?’’ అని కాంగ్రెస్, బీఆర్ఎస్​పై మండిపడ్డారు. తాము బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటితరానికి తెలియజేయకపోవడం బాధాకరమని అన్నారు. 

తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో బుధవారం కరీంనగర్ లోని టీఎన్జీవోస్ భవన్​ కల్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఫొటో ఎగ్జిబిషన్'ను బండి సంజయ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు భయపడి ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు, గత  బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అరుదైన చిత్రాలు 3 రోజులపాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా, కరీంనగర్ ఐటీఐ కాలేజీలో తొలిసారిగా అగ్ మెంటెడ్ రియాలిటీ, వీడియో వర్చువల్ రియాలిటీ పద్ధతిలో వివిధ కోర్సులకు సంబంధించి బోధన ప్రారంభమైంది. ఈ ల్యాబ్ ను బండి సంజయ్​ప్రారంభించారు.