మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకోకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉప ఎన్నిక మునుగోడుకు మాత్రమే సంబంధించిన ఎన్నిక కాదన్నారు. ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువకుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది’ అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గడీల వద్ద కొమ్ము కాస్తున్నారని, గడీల పాలనలో బందీ అయ్యానని తెలంగాణ తల్లి ఆత్మ గోషిస్తోందని బండి సంజయ్ అన్నారు. గడీల పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి, బీజేపీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పేదోళ్ల బతుకులు ఆగమవుతాయని, ఓట్లను మాత్రం అమ్ముకోవద్దని కోరారు.
చర్లగూడెం భూ నిర్వాసితులకు పరిహారం ఇస్తానని, రాచకొండలో ఫిలింసిటీ కట్టిస్తానని, నారాయణపూర్ మండలంలోని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి..ఇంత వరకూ నెరవేర్చలేదని బండి సంజయ్ మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టారని, గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని చెప్పారు. కులాలు, సంఘాల పేర్లతో ఓట్లను చీల్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజల సమస్యలను, నియోజకవర్గం అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. ‘మన దీపావళి నవంబర్ 6న. బీజేపీకి ఓట్లు వేయండి. ఓట్లు వేయించండి’ అని ఓటర్లను బండి సంజయ్ కోరారు.
గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను ఆపించాడంటూ టీఆర్ఎస్ తనపై ఆరోపణలు చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ విషయంపై చర్చించేందుకు రేపు శివాలయం వద్దకు రావాలంటూ టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కృషి చేయడం లేదన్నారు. పోలీసులకు అండగా ఉండేది బీజేపీ మాత్రమే అన్నారు. పోలీసు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో పేదల కోసం బీజేపీ పని చేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో రైతులు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకూ కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బీజేపీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ నిర్ణయాలతో 36మంది ఆర్టీసీ కార్మికులు మృతిచెందారని అన్నారు. ఒక్కో వ్యక్తి పేరు మీద కేసీఆర్ లక్షా 20వేల అప్పు చేశారని ఆరోపించారు.