వేములవాడ రూరల్, వెలుగు: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మర్డర్ కు సీఎం కేసీఆరే బాధ్యుడని, ఆయనపై హత్య కేసు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గురువారం వేములవాడలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని, రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ హామీ ఇచ్చారు. మరి అది ఏమైంది? పోడు భూముల సమస్యలను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు. సీఎం కుట్రలకు అధికారులు, ప్రజలను బలి చేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.
బీజేపీ నేతలకు నోటీసులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. అవినీతి అక్రమార్కులపై ఐటీ, ఈడీ దాడులు చేస్తే బీజేపీపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే ఆ శాఖ అధికారులు తనిఖీలు చేస్తారని చెప్పారు. లిక్కర్స్కాంలో తన కుటుంబ సభ్యులపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అంతకుముందు దివ్యాంగులకు బండి సంజయ్ ట్రై సైకిళ్లు, ఇతర పరికరాలు అందజేశారు.