- సరైన టైంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటది: బండి సంజయ్
- అవినీతిపై కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినం
- తప్పులు బయటపడతాయని కేసీఆర్ భయపడుతున్నరు
- బీజేపీపై, కేంద్ర మంత్రులపై విమర్శలు చేస్తున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రం డేగ కన్ను వేసిందని, సీఎం అవినీతి క్లియర్గా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై తాము ఇప్పటికే కేంద్రానికి కంప్లైంట్ చేశామని, సరైన సమయంలో విజిలెన్స్ సంస్థలు విచారణ చేస్తాయని చెప్పారు. సోమవారం జూమ్ యాప్ ద్వారా సంజయ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని, అధికారం పోయాక వారి బతుకులు బయటపడతాయని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో అధికారం బీజేపీదేనని చెప్పారు.
భయంతోనే విమర్శలు
మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ను విడిచిపోతారని.. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని కేసీఆర్కు భయం పట్టుకుందని.. అందుకే బీజేపీపై, కేంద్ర మంత్రులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని, ఏపీ సీఎం జగన్ కు దాసోహం అయ్యారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతికి సంబంధించి ఒక సంస్థపై ఐటీ దాడులు జరిగాయని.. ఆ దాడులకు ముందు, తర్వాత ఏం జరిగిందో బయటపెడతానని చెప్పారు. మేధావులమని చెప్పుకుంటున్న కొందరి తెలివిని చూసి జనం నవ్వుకుంటున్నారని.. సీఎంకు దగ్గరగా ఉండే ఓ నేతను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
రాష్ట్రానికి నీళ్లలో ఇంకా అన్యాయమే..
2014 నుంచి ఇప్పటిదాకా నీళ్ల విషయంలో కేసీఆరే తెలంగాణకు అన్యాయం చేశారని సంజయ్ ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ కు మూడు సార్లు ఎజెండా పంపాలన్నా స్పందించలేదని.. మంగళవారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే రెండు, మూడ్రోజుల ముందు ఎజెండా పంపుతారా అని ప్రశ్నించారు. ఇది ఎవరిని మోసం చేయడానికని నిలదీశారు. 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి వినియోగంపై అంగీకారం కుదిరిందని.. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు తాను ఎంపీ హోదాలో లేటర్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాతే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి స్పందించి.. కృష్ణా బోర్డుకు లెటర్రాశారన్నారు. సీఎం కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. 2019–20 లో 114 టీఎంసీలు వాడుకోవాల్సిన ఏపీ.. 170 టీఎంసీలు వాడుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడికి పోయారని నిలదీశారు.
మీరే చూసుకుంటామని కేంద్రంపై నిందలేంటి?
‘‘ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి దావత్ లు చేసుకుంటారు. కేంద్ర పెత్తనం ఏమిటని నిలదీస్తారు. తామే పరిష్కరించుకుంటామని ప్రకటిస్తారు. మరి ఇప్పుడు కేంద్రంపై నిందలేయడం ఏమిటి?” అని బండి సంజయ్ నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ సర్కారు సంగమేశ్వరానికి ఎట్లా టెండర్లు పిలిచిందని ప్రశ్నించారు.