పొన్నం, గంగుల, నేను.. మేమంతా ఒక్కటే : బండి సంజయ్‌‌

పొన్నం, గంగుల, నేను.. మేమంతా ఒక్కటే :  బండి సంజయ్‌‌
  • మా మధ్య గొడవల్లేవ్‌‌...
  • పొన్నం, గంగుల మధ్య గ్యాప్‌‌ ఉంటే ఈ సభతో పోయినట్టే 
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌

కరీంనగర్, వెలుగు :
 ‘నాకు, పొన్నం ప్రభాకర్‌‌, గంగుల కమలాకర్‌‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, పొన్నం, గంగుల మధ్య కొంచెం గ్యాప్‌‌ ఉన్నట్లుంది, అది కూడా ఈ సభతో తీరిపోతుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ చెప్పారు. కరీంనగర్‌‌ స్మార్ట్‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం కేంద్ర మంత్రి మనోహర్‌‌లాల్‌‌ ఖట్టర్‌‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌‌ సునీల్‌‌రావు హాజరయ్యారు.

 ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో బండి సంజయ్‌‌ మాట్లాడారు. కరీంనగర్‌‌ను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ‘ప్రసాద్‌‌’ స్కీంలో చేరుస్తున్నామని, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ సర్క్యూట్‌‌లో చేరుస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్‌‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌‌కు కేంద్రం త్వరలో ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌ను ప్రకటించబోతోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.

మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణకు సహకరించండి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌‌లు ప్రారంభం అయ్యాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో కేంద్రం నుంచి 8 శాతం ఇండ్లు రావాల్సి ఉంటే 0.7 పర్సంటేజ్‌‌ మాత్రమే వచ్చాయన్నారు. ఈ సారైనా తెలంగాణకు రావాల్సిన మొత్తం ఇండ్లను కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనకు, 75 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. ఇందుకు కేంద్రమంత్రులు కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌ చొరవ తీసుకోవాలన్నారు.

వాట్‌‌ ఈస్‌‌ దిస్‌‌ నాన్సెన్స్ 
కలెక్టర్‌‌పై మంత్రి పొంగులేటి అసహనం

కరీంనగర్‌‌ పర్యటనలో పోలీసుల తీరుపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వచ్చిన లీడర్లు, అధికారులు పదే పదే తోసివేయడం, వారిని పోలీసులు కట్టడి చేయకపోవడంతో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌‌ కొంత ఇబ్బందికి గురయ్యారు. ఇలా మూడు చోట్ల తోపులాట జరిగింది. దీంతో హౌసింగ్‌‌ బోర్డు కాలనీలోని వాటర్‌‌ ట్యాంక్‌‌ వద్ద ఆఫీసర్ల తీరుపై మంత్రి పొంగులేటి మండిపడ్డారు. తన వెంట నడుస్తున్న కలెక్టర్‌‌ పమేలా సత్పతి వైపు చూస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘వాట్‌‌ ఈజ్‌‌ దిస్‌‌ నాన్సెన్స్‌‌’ అంటూ ఫైర్‌‌ అయ్యారు. ‘ఎస్పీ ఎక్కడ ?’ అంటూ ప్రశ్నించారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు.