పోలీసుల తీరుపై కోర్టు తలుపు తడతాం : బండి సంజయ్​

జగిత్యాల జిల్లా:  భైంసాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసాలో ప్రజాసంగ్రామ యాత్రకు ముందు అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతున్న ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా..అక్కడికి ఎందుకు వెళ్లొద్దని బండి సంజయ్ ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విమర్శించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు. రేపు మధ్యాహ్నం  వరకు తమకు సమయం ఉందని.. అప్పటివరకు వేచి చూస్తామని చెప్పారు. గొడవలు జరగకుండా సజావుగా యాత్ర జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

‘‘నిర్మల్ లో ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొట్టుకుంటూ హోటల్లో నుంచి ఖాళీ చేయిస్తున్నరు. ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే కార్యకర్తలను ఎస్పీ ఆఫీసులోనే పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఆఫీసుకు పోయే హక్కు కూడా బీజేపీ కార్యకర్తలకు లేదా ? తెలంగాణలో రాచరికపు పాలన నడుస్తోంది. వెంటనే కార్యకర్తల పై దాడులు ఆపండి. అరెస్టు అయిన కార్యకర్తలను విడుదల చేయండి. ప్రజా సంగ్రామ యాత్రకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఇవ్వకపోతే దాని పరిమాణాలు వేరే ఉంటాయి. మేం ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని నమ్ముకున్నాం. పాదయాత్ర సజావుగా నడుస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు సభకు వెళ్లి తీరుతా.- పోలీసుల తీరుపై  న్యాయస్థానం తలుపు తడతాం” అని బండి సంజయ్​ వ్యాఖ్యానించారు. 

  • మాల్యాల చౌరస్తా వద్ద ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలువుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారని బండి సంజయ్​ అన్నారు. ఓ పోలీసు అధికారి రాక్షసంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తన  కళ్ళముందే కార్యకర్తలను కొట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.   
  • రేపు మధ్యాహ్నం వరకూ బండి సంజయ్ కరీంనగర్​ లోని జ్యోతినగర్ లో ఉన్న అత్తగారి నివాసం వద్ద ఉండనున్నారు. ఈనేపథ్యంలో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు : డీకే అరుణ  

‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేయడం పిరికిపంద చర్యే. ఓటమి భయంతోనే కేసీఆర్​ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటాన్ని కేసీఆర్​ జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు”అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  పేర్కొన్నారు.