పెద్దపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్నే తిరగరాస్తానంటూ బరితెగించాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌ది విచిత్రమైన వ్యవహార శైలి అని సంజయ్ ఎద్దేవా చేశారు. ABVP విద్యార్థి సంఘం నాయకుడు, LB నగర్ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్న రూపిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తల్లి చనిపోవడంతో వారి స్వగ్రామమైన ఓదెల మండలం జిలకుంట గ్రామంలో విష్ణువర్ధన్ రెడ్డిని, కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణ సమాజమంతా కేసీఆర్‌ను ఛీ కొడుతున్నరు. సీఎం పదవి కోసం ఆయన కొడుకు రోజూ ఇంట్లో గొడవ చేస్తున్నట్లుంది. కుర్చీలు, టీవీలు పగలగొడుతుండట. అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంపై విచారణ జరుగుతుండటంతో కేసీఆర్ పూర్తి డిప్రెషన్లోకి పోయిండు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నడు. అక్రమంగా కేసులు బనాయిస్తున్నడు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా దాడులు చేయిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండటం నీచాతి నీచం. కేసీఆర్ పాలనలో ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు పోతే న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది. బీజేపీ సహా ఇతర పార్టీలపైనా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నరు. రెచ్చగొట్టేలా విషపు రాతలు రాయిస్తున్నరు. పత్రికా స్వేచ్ఛ ముసుగులో పచ్చి అబద్దాలు, రెచ్చగొట్టే రాతలతో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నరు. కేసీఆర్ అవినీతి కుంభకోణాలపై విచారణ జరుగుతుండటంతో తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని ఆటలు ఆడుతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, గవర్నర్ పైనా దుష్ప్రచారం చేయిస్తున్నరు’ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
For More News..