సీఎం మెరుపులెక్క వచ్చి ఏదేదో మాట్లాడిపోతున్నడు

గాంధీ ఆస్పత్రిలో మిస్సైన మధుసూదన్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరోన విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సీఎం మెరుపులెక్క అప్పుడప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడి పోతారు… ఏదైనా అడిగితే మీడియాను తిడతారని ఆయన అన్నారు. కరోన విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. రిపోర్టులకు తేడా ఉందని ఆయన అన్నారు. ఆ లెక్కలు జనాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయని ఆయన అన్నారు.

‘ఈశ్వరయ్య అనే వ్యక్తి 29వ తేదీన చనిపోయాడని గాంధీ హాస్పిటల్ చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం 30వ తేదీన చనిపోయాడని అంటుంది. ఈశ్వరయ్య 29వ తేదీన మధ్యాహ్నం చనిపోతే.. మరి ఆ రోజు హెల్త్ బులెటిన్ లో మాత్రం ఎవరు చనిపోలేదని ఎందుకు చెప్పారు? ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ (పేషంట్ నెంబర్ 1053)30వ తేదీ సాయంత్రం 7.30కి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంటనే వెంటిలేటర్ పై పెట్టామని ప్రభుత్వం చెబుతుంది. మే 1 వ తేదీ మధ్యాహ్నం 12.05 నిమిషాలకు మధుసూదన్ తో ఆయన భార్య మాట్లాడారు. వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తి తన భార్యతో ఏ విదంగా మాట్లాడారు? మధుసూదన్ అదే రోజు సాయంత్రం 6 గంటలకు చనిపోయారు. మరి ఇప్పటి వరకు ధ్రువీకరణ పత్రం ఎందుకు ఇవ్వలేదు? తండ్రి చనిపోతే ధ్రువీకరణ పత్రం ఇచ్చారు కదా.. మరి కొడుకు చనిపోతే మాత్రం ఇవ్వరా? గాంధీ హాస్పిటల్ మార్చురీకి డెడ్ బాడీ ఎప్పుడు వచ్చిందో రికార్డ్ చేయలేదు. కానీ డెడ్ బాడీని గాంధీ మార్చురీ మాత్రం 2వ తేదీ ghmcకి హ్యాండోవర్ చేసింది. మరి ghmc అంత్యక్రియలు ఎక్కడ చేసింది? అంత్యక్రియలకు సంబంధించిన వీడియో రికార్డ్ చేసి సంబంధిత ACPకి పోలీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వ నిబంధన. మరి వీడియో రికార్డ్ ఎందుకు చూపెట్టలేదు? ప్రభుత్వానికి మనిషి ప్రాణం అంటే విలువ లేదా? డాక్టర్లు దేవుళ్ళతో సమానం. వారిని ఎవరు కించ పరచరు. నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ ని మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని మాధవితో చెప్పారు. ప్రభుత్వం మధుసూదన్ మృతిని ఎందుకు దాచి పెట్టె ప్రయత్నం చేస్తోంది? ప్రభుత్వం ఇంత నీచ స్థాయికి దిగజారుతదా? రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవతా హృదయం ఉందని భావిస్తున్నాం. వెంటనే మధుసూదన్ ని ప్రాణాలతో కుటుంబానికి అప్పగించాలి. లేకుంటే ఇది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తాం. కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి కనీసం టెస్ట్ కూడా చేయలేదు. డాక్టర్ లకు, నర్సులకు, సిబ్బందికి టెస్ట్ లు చేయడంలేదు. దాంతో వారంతా భయపడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్లనే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కాంట్రాక్టులతో దోచుకుని దాచుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని టెస్టులు చేసింది? అసలు ఎన్ని చేయాలి? ప్రజల మరణాలు కోరుకుంటుంది మీరు.. మేము కాదు. మధుసూదన్ వ్యవహారం డాక్టర్ల తప్పు ఎంత మాత్రం కాదు. ఇది కేవలం ప్రభుత్వం తప్పే. సీఎం మీడియాను బెదిరిస్తున్నాడు. మీడియా కూడా బెదిరించాలి. మేం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నాం. మరి మేం బెదిరించడం లేదు కదా’అని అన్నారు.

నా భర్తని నాకు ఇచ్చేయమనండి
తన భర్తను తనకు ఇచ్చేయాలని.. తనకు ఇంకేది వద్దని మధుసూదన్ భార్య మాధవి లత అంటున్నారు. అధికారులు, వైద్యులు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారని ఆమె అంటుంది. ‘నా భర్త చనిపోలేదు. నా పిల్లలకు ఏం చెప్పాలి? వాళ్ళ మనషులకి కూడా ఏదైనా అయితే ఇలాగే స్పందిస్తారా? గాంధీ హాస్పిటల్ నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడితే.. డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత సీఐకి పోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తే సీఐ ఎత్తలేదు.. ఆ తర్వాత కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు’అని ఆమె బాధపడుతోంది.

For More News..

సుద్దాల అశోక్ తేజ ఆపరేషన్ సక్సెస్