కేసీఆర్ కారును జనం ముంచుతరు

జీహెచ్​ఎంసీ పోల్స్​లో కేసీఆర్ కారు మునగడం ఖాయం

వరదలతో జనం అవస్థ పడుతుంటే సీఎం ఫామ్ హౌస్​ల పంటడా?

సర్కారును నిలదీసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: ‘గ్రేటర్ హైదరాబాద్ జనం వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​లో పడుకుంటడా? ఫామ్​హౌస్​కే పరిమితమయ్యే ముఖ్యమంత్రికి ప్రజల బాధలెలా తెలుస్తయి? సీఎం వైఖరిలో మార్పు రాకుంటే ప్రజలు తిరగబడే రోజులొస్తయ్’ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. వరదలకు సిటీలోని కార్లు మునిగినట్టే కేసీఆర్ కారును జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో జనం ముంచుతరని వార్నింగ్ ఇచ్చారు. గ్రేటర్​లోని సరూర్​నగర్ పీ అండ్ టీ కాలనీ, కోదండరాం నగర్, దిల్​సుఖ్ నగర్, గడ్డి అన్నారం, వనస్థలిపురం, వైదేహీనగర్, బాలాపూర్ ఎక్స్ రోడ్ లోని లెనిన్ నగర్, బైరామల్ గూడ, హయత్ నగర్ లోని బంజారా కాలనీల్లో సంజయ్ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వాళ్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

సూడనింకె ఒక్కరూ రాలేదంట

‘నేను తిరిగిన ప్రాంతాలకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నేతలు ఎవరూ రాలేదని బాధితులు చెప్పారు. కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటు’ అని సంజయ్​ విమర్శించారు. తమ పార్టీ, అనుబంధ సంఘాల కార్యకర్తలు నిత్యవసరాలు పంచే వరకు, ప్రభుత్వం ఇటు వైపు చూసిన దిక్కే లేదన్నారు. ప్రజలు ఇంతటి బాధలో ఉంటే కేసీఆర్ మాత్రం తనకేమీ పట్టనట్టు అధికారులను బెదిరించి ధరణి వెబ్​సైట్ లో తన ఆస్తులను నమోదు చేయించుకున్నారని మండిపడ్డారు. వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర సర్కారుకు, రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర శాఖ నివేదిక అందిస్తుందన్నారు. రాష్ట్ర సర్కారుకు కేంద్రం తప్పకుండా సాయం చేస్తుందని చెప్పారు.

ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తరా?

వానలతో సిటీలోని కాలనీలన్నీ మూసీ నదిలా మారాయని, 8 వేల కార్లు నీట మునిగాయని సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారునూ జనం అలాగే ముంచుతారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రాకుండా వేరే వాళ్లను పంపడమేంటని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారని.. అవేమయ్యాయని నిలదీశారు. బైరామల్​గూడలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు ఆయన్ను కొందరు దళిత మహిళలు, స్థానికులు ప్రశ్నిస్తే వారిపైకి పోలీసులను ఉసిగొల్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ‌‌‌‌ర‌‌‌‌ద‌‌‌‌లతో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఆరెకరాల చెరువు రెండెకరాలైంది

ఆరెకరాల బైరామల్​గూడ చెరువు రెండెకరాలకు పరిమితమైందని, కొందరు టీఆర్​ఎస్​ గుంటనక్కలు చెరువులను ఆక్రమించుకుంటుండటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సంజయ్ మండిపడ్డారు. ఆరేళ్లలో సిటీలో వందలాది చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని, అందుకే సిటీలో ఈ వరదలని విమర్శించారు.

For More News..

నీళ్లున్నప్పుడు రాలేదు గాని.. పొయినంక వస్తరా?

పానీ మే హైదరాబాద్.. ఫామ్​హౌస్ మే కేసీఆర్

నాలాల దగ్గరున్నోళ్లు ఖాళీ చేస్తే డబుల్ ఇండ్లిస్తం