అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. శాసనసభ్యుడిగా 5 సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దళిత నేత జి.సాయన్న మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం..సుధీర్ఘ కాలం ప్రజలకు సేవలందిస్తూ శాసనసభ్యుడిగా కొనసాగుతూ మరణించిన సాయన్నకు మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయమని అన్నారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉంటూ మరణించిన సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం... దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయని చెప్పారు.
ఈ ఘటన మరవక ముందే ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణిస్తే సీఎం కేసీఆర్ స్పందించకపోవడాన్ని బాధాకరమని బండి సంజయ్ తెలిపారు. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలు కన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తూ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీన వర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. దళిత జాతికే అవమానం.. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.