- సమాజానికి చెడు జరగాలని కోరుకునేటోళ్లకు తగినశాస్తి జరుగుతది: సంజయ్
- ప్రజలను ఆదుకునేందుకే తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడి
కరీంనగర్, వెలుగు: కేసీఆర్ పైకి రాజశ్యామల యాగం చేస్తున్నట్లు చెబుతున్నారని, లోపల మాత్రం జన వశీకరణ పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు అల్లాడుతున్నాయని, రాష్ట్రం అప్పులపాలై సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇబ్బందులుపడుతున్న ప్రజలను ఆదుకోవడంతోపాటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ లో గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ ప్రజలు తనను దీవించి ఎంపీగా గెలిపిస్తే ఏనాడూ ఇంట్లో కూర్చోలేదని, ప్రజల పక్షాన సర్కార్ పై పోరాటాలు చేసి అండగా నిలిచి కరీంనగర్ ప్రజలు తలెత్తుకొని తిరిగేలా చేశానని చెప్పారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే కరీంనగర్ లోని టవర్ సర్కిల్, కమాన్ చౌరస్తా సహా మున్సిపల్ కార్పొరేషన్ పైనా ఎంఐఎం జెండాలే ఎగురుతాయని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే వచ్చే కరీంనగర్ కార్పొరేషన్ సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంకు 30 సీట్లు కేటాయించడంతోపాటు మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేలా ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు.