సీఎం కేసీఆర్.. లిక్కర్ స్కామ్ నుంచి తన కూతుర్ని కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపుతుందని ఆయన చెప్పారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ దీక్షాపరులకు విధుల్లో వెసులుబాటు ఎందుకు ఇవ్వరని ఆయన అడిగారు. ఎములాడ, ధర్మపురి, బాసర, కొండగట్టు ఆలయాల నిధుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరూ సీఎంలు కలిసిపోయిన్రు: బండి సంజయ్
ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసి.. కాంట్రాక్టులు, కమీషన్లు దోచుకుంటూ సింటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కలిసి సమైఖ్యాంధ్ర సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. వడ్ల కొనుగోళ్లు లేక కల్లాల వద్ద రైతులు పడుతున్న గోస సీఎంకు పట్టడం లేదన్నారు. తరుగు పేరుతో రైతును దళారులు దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి లేక యువత ముంబయి, గల్ఫ్ వలస బాట పడుతున్నారని చెప్పారు. గల్ఫ్ సంక్షేమానికి రూ.500 కోట్ల నిధి, 5 లక్షల ఆర్దిక సాయం హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక పార్టీలు అన్నీ ఏకమయ్యాయని ఆయన విమర్శించారు. అయితే మోడీ సింహం.. సింగిల్ గానే వస్తారంటూ బండి వ్యాఖ్యలు చేశారు.
పీఎఫ్ఐ పై చర్యలు తీసుకోండి: బండి సంజయ్
కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) తీవ్రవాద సంస్థకు టీఆర్ఎస్ నిధులు ఇస్తుందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని, ఎన్ఐఏ సోదాలు నిర్వహించే దాకా రాష్ట్ర ఇంటెలిజెన్స్, పోలీసులు అసలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పీఎఫ్ఐ తీవ్రవాదుల జోలికి పోకుండా పోలీసులను టీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని విమర్శించారు. జగిత్యాల నడిబొడ్డున ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన దుర్మార్గులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.