అవినీతి పరుడెవరో తేల్చుకుందామా..? : గంగులకు బండి సంజయ్ సవాల్

తాను నోరు విప్పితే బిస్తర్ సర్దుకోవాల్సిందే అంటూ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి.. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు. తాను వందల కోట్లు సంపాదించానని ఆరోపించిన గంగుల.. వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. అవినీతి పరుడెవరో తేల్చుకుందామా..? అంటూ ప్రశ్నించారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే తన ఆస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తానని చెప్పారు. గంగుల అవినీతి, అక్రమాస్తుల వివరాలను ప్రజల ముందుంచుతానన్నారు. అవన్నీ జనాలకు రాసిచ్చేందుకు గంగుల సిద్ధమా..? అని ప్రశ్నించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 

కరీంనగర్ అభివృద్ధికి ఎవరేం చేశారో టవర్ సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని అడిగారు. చాలా మంది వ్యాపారుల కుటుంబాలను గంగుల నాశనం చేసిన చిట్టా తన దగ్గర ఉందన్నారు. తాను నోరు తెరిస్తే గంగుల కరీంనగర్ లో తిరగలేడన్నారు. కేసీఆర్ ను ఒప్పించి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని,  తాను కేంద్రంతో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కాపత్రంతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. తాను ఏ రోజు ఏ వ్యాపారస్తుల వద్ద పైసలు వసూలు చేయలేదన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. 

తాను నోరు తెరిస్తే.. ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా గంగులను, తన అనుచరులను వారి ఇంటి గడప కూడా తొక్కనీయరని చెప్పారు. ఇలానే వ్యవహరిస్తే.. వ్యాపారస్తులు గంగులను రోడ్డుమీద కూడా తిరగనీయరని హెచ్చరించారు. తాను అవినీతికి పాల్పడితే తనకు బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. తాను అవినీతి పరుడినైతే ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయమంటుంది అని ప్రశ్నించారు. గంగులను బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కే ఎందుకు పరిమితం చేసిందన్నారు. మొదటి విడతలో బీఫామ్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేశారో సమాధానం చెప్పాలన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే దారుస్సలాం పోయి మోకరిల్లి ఎంఐఎం ద్వారా టిక్కెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి భూకబ్జాదారుడని, ప్రజల గురించి అతనికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. కరీంనగర్ గురించి అవగాహనే లేని వ్యక్తికి ఓట్లేస్తే వృథా అయినట్లే అన్నారు.